నిజాముద్దీన్‌ మసీదు ఇమామ్‌పై ఎఫ్‌ఐఆర్: ఢిల్లీ ప్రభుత్వం ఆదేశం

మంగళవారం, 31 మార్చి 2020 (07:07 IST)
తన నిర్లక్ష్యపు వ్యవహారంతో కరోనా వ్యాప్తికి కారణమయ్యాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నిజాముద్దీన్‌లోని ప్రముఖ మసీదు ఇమామ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి మతపరమైన కార్యక్రమాన్ని.. అది కూడా దాదాపు 300 నుంచి 400 మందితో నిర్వహించడమే ఇందుకు కారణం. ఈ కార్యక్రమం ఏ రోజు జరిగిందనే విషయంపై స్పష్టత లేకపోయినప్పటికీ.. మార్చి 15 నుంచి 20 మధ్యలో జరిగిందని తెలిసింది.

ఈ కార్యక్రమానికి మలేషియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, కజికిస్తాన్ దేశాల నుంచి పలువురు హాజరయ్యారు. వీరితో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఈ కార్యక్రమానికి హాజరయినట్లు తెలిసింది. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా హాజరయినట్లు సమాచారం.

ఈ కార్యక్రమానికి హాజరయిన వారిలో తమిళనాడుకు చెందిన ఒకరు కరోనా బారిన పడి మరణించగా.. 10 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో.. ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ కార్యక్రమానికి హాజరయిన వారందరిపై నిఘా పెట్టింది. నిజాముద్దీన్ ప్రాంతంలో దాదాపు వంద మందికి పైగా కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో.. ఆ ప్రాంతాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు.

లక్షణాలు కనిపించిన 163 మందిని ఢిల్లీ ప్రభుత్వం బస్సుల్లో లోక్‌ నాయక్ ఆసుపత్రికి తరలించింది. వారికి కరోనా నిర్ధారిత పరీక్షలు నిర్వహించారు. మంగళవారం రిపోర్ట్‌లు వచ్చే అవకాశమున్నట్లు వైద్యులు తెలిపారు. వీరిలో కొందరు విదేశీయులు కూడా ఉన్నారు.

తిరిగి వారి స్వదేశాలకు వెళ్లేందుకు లాక్‌డౌన్ అమలు నేపథ్యంలో విమాన సర్వీసులు లేకపోవడంతో వారంతా దేశ రాజధానిలోనే ఉన్నారు. కరోనా వైరస్ కేసులు దేశ రాజధాని ఢిల్లీని కలవరపెడుతున్న తరుణంలో ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన ఈ మతపరమైన కార్యక్రమం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం అవగాహన పెంచుకోండి ప్లీజ్..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సూచనలు