Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హర్యానా సీఎంకు రైతుల ఆందోళన సెగ.. హెలికాఫ్టర్ ల్యాండింగ్‌కు ఆటంకాలు

Advertiesment
హర్యానా సీఎంకు రైతుల ఆందోళన సెగ.. హెలికాఫ్టర్ ల్యాండింగ్‌కు ఆటంకాలు
, సోమవారం, 11 జనవరి 2021 (09:56 IST)
బీజేపీ పాలిత హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు రైతుల ఆందోళన సెగ తగిలింది. దేశ రాజధాని న్యూఢిల్లీ సరిహద్దుల్లో ఒకటైన కర్నాల్ ప్రాంతంలో నిరసనలు తెలుపుతున్న రైతులతో చర్చించేందుకు ఆయన బయలుదేరగా, ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను రైతులు కిందకు దిగనివ్వలేదు. 
 
రైతులు చాపర్ ల్యాండ్ కావాల్సిన ప్రదేశాన్ని ఆక్రమించడంతో, ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. కేంద్రం గత సంవత్సరం తీసుకుని వచ్చిన వ్యవసాయ చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, వాటిని రద్దు చేసేవరకూ తమ నిరసనలను ఆపబోమని తేల్చి చెబుతున్నారు.
 
ఇక ఖట్టర్ ప్రసంగించాల్సిన వేదిక వద్ద కూడా రైతులు తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన సెల్‌ఫోన్ల ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైతులు డయాస్ మీద ఉన్న కుర్చీలను విసిరివేస్తూ, బ్యానర్లు, పోస్టర్లను ధ్వంసం చేస్తూ కనిపించారు. 
 
రైతులకు ఏం చెప్పాలని ఖట్టర్ ప్రయత్నిస్తున్నారో వివరణ ఇచ్చిన తర్వాతనే తమ వద్దకు రావాలని "కిసాన్ మహా పంచాయత్" డిమాండ్ చేసింది. మరోవైపు, ఆందోళనకు దిగిన రైతులను శాంతింపజేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో తొలుత టియర్ గ్యాస్ ప్రయోగించి, ఆ తర్వాత లాఠీ చార్జ్ చేశారు. 
 
కాగా, ఇప్పటికే పలు దఫాలుగా కేంద్ర మంత్రులు రైతులతో చర్చించారన్న సంగతి విదితమే. అయితే, రైతులు మాత్రం తమ డిమాండ్ ఒకటేనని, వ్యవసాయ చట్టాల రద్దు మినహా తమకేమీ అవసరం లేదని అంటున్నారు. 
 
"దాదాపు 50 వేల మంది రైతులు నేను ఏం మాట్లాడతానో వినాలని భావించారు. అయితే, కొంతమంది మాత్రం నన్ను వ్యతిరేకించారు. వారి కారణంగానే నా పర్యటన వాయిదా పడింది. నా చాపర్ ను వెనక్కు తీసుకెళ్లాలని నేనే సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగడం నాకు ఇష్టం లేదు" అని తన పర్యటన రద్దయిన తరువాత ఖట్టర్ మీడియాకు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్మీ రిక్రూట్​మెంట్​ కు నోటిఫికేషన్ జారీ