Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

ఇంగ్లండ్ ప్రధాని భారత పర్యటనను రద్దు చేసుకోవాలి : రైతుల విన్నపం

Advertiesment
Farmers Agitation
, బుధవారం, 23 డిశెంబరు 2020 (12:57 IST)
కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. గజగజ వణికే చలిని సైతం వారు లెక్క చేయకుండా ఆందోళన చేస్తున్నారు. ఈ రైతుల ఆందోళనకు అన్ని వర్గాలకు చెందిన ప్రజలు సంపూర్ణ మద్దతునిస్తున్నారు. 
 
ఈ క్రమంలో జనవరి 26వ తేదీన జరుగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని పర్యటనకు రైతుల నిరసన సెగ తాకింది. బోరిస్ జాన్సన్ భారత్ రావొద్దంటూ రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. 
 
అంతేగాకుండా బ్రిటన్ ఎంపీలు వాళ్ల ప్రధాని భారత్‌కు రాకుండా ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. సింఘు సరిహద్దు దగ్గర ధర్నా చేస్తున్న రైతు సంఘాల నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చర్చలపై కేంద్రం రాసిన లేఖపై రేపు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రైతుల డిమాండ్లను కేంద్రం ఒప్పుకునే వరకూ బోరిస్ భారత పర్యటన రద్దు చేసుకోవాలని రైతు సంఘాలు లేఖ రాశాయి. 
 
మరోవైపు, బ్రిటన్‌లో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలను రేకెత్తిస్తోంది. కరోనా ఇంకా ఉద్ధృతంగా ఉన్న తరుణంలోనే కొత్త స్ట్రెయిన్ రావడం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే ఈ కొత్త వైరస్ పలు ఇతర దేశాలకు పాకినట్టు తెలుస్తోంది. 
 
ఈ వైరస్ మరింతగా వ్యాపించకుండా ఉండేందుకు పలు దేశాలు బ్రిటన్ పై ట్రావెల్ బ్యాన్ విధించాయి. ఇండియా కూడా ట్రావెల్ బ్యాన్ విధించినప్పటికీ... రేపటి నుంచి నిషేధం అమల్లోకి రాబోతోంది. మరోవైపు, బ్రిటన్ నుంచి పెద్ద సంఖ్యలో భారతీయులు స్వదేశానికి తిరిగొస్తున్నారు. దేశంలోని అన్ని విమానాశ్రయాలలో ప్రయాణికులకు టెస్టులు నిర్వహిస్తున్నారు.
 
లండన్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీకి చేరుకున్న 266 మంది ప్రయాణికుల్లో ఐదుగురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో, ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ఉదయం బ్రిటీష్ ఎయిర్ వేస్‌కు చెందిన మరో విమానం ఢిల్లీలో ల్యాండ్ అయింది. 
 
ఈ విమానంలో వచ్చిన ప్రయాణికులందరి శాంపిల్స్‌ని సేకరించారు. వీరి శాంపిల్స్‌ను నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఫర్ రీసర్చ్‌కి పంపించారు. పాజిటివ్ వచ్చిన వారందరినీ ఐసొలేషన్‌కు పంపుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బోరిస్ జాన్సన్ తన భారత పర్యటనను వాయిదా వేసుకునే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖ జిల్లాలో వింత కోడిపిల్ల