భారత రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) తయారు చేసిన డీఆర్డీవో 2 డీజీ (2 డీఆక్సీ డీ గ్లూకోజ్) ఔషధాన్ని అభివృద్ధి చేసింది. అయితే, ఈ ఔషధ వినియోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలని డీఆర్డీవో స్పష్టం చేసింది.
తాజాగా దీని వాడకంపై మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా చికిత్సలో 2డీజీ ఔషధాన్ని ఇష్టం వచ్చినట్టు వాడొద్దని, వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి అని పేర్కొంది. ఓ మోస్తరు నుంచి తీవ్ర కరోనా లక్షణాలు ఉన్నవారికి దీన్ని వాడొచ్చని తెలిపింది.
ప్రస్తుత చికిత్సకు అనుబంధంగానే దీన్ని వాడాలని సూచించింది. డాక్టర్లు గరిష్టంగా 10 రోజుల లోపు 2డీజీ వాడకాన్ని సూచించాలని వివరించింది. కొన్ని జబ్బులు ఉన్నవారికి 2డీజీ ఔషధం వాడేముందు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.
డయాబెటిస్, తీవ్రస్థాయి గుండెజబ్బులు, హెపటిక్ రీనల్ ఇంపెయిర్ మెంట్, తీవ్ర శ్వాసకోశ సమస్యలు, ఉన్నవారిపై ఈ ఔషధాన్ని పరీక్షించలేదని వెల్లడించింది. అలాగే 18 ఏళ్ల లోపు వారు, గర్భవతులు, పాలిచ్చే తల్లులకు ఈ మందు వాడొద్దని డీఆర్డీవో స్పష్టం చేసింది.
2డీజీ ఔషధం కోసం
[email protected]కి మెయిల్ చేయాలని తెలిపింది. అది కూడా కరోనా బాధితులు, లేదా వారి కుటుంబ సభ్యులు మెయిల్ చేయాల్సి ఉంటుందని వెల్లడించింది.