పక్షుల గుడ్లపై ఉండే పెంకు (shell)గాలి ప్రవేశించడానికి అడ్డంకి కాదు. దాంట్లో మన కంటికి కనబడని అతి సన్నని రంధ్రాలు ఉంటాయి. వాటి ద్వారా వాయువులు లోపలికి, వెలుపలకు వ్యాపిస్తూనే ఉంటాయి.
గుడ్లలో ఉండే పక్షి పిల్లల పిండాలకు వూపిరితిత్తులంటూ ఏమీ ఉండవు. కానీ ఆ పిండాన్ని అంటుకొని పెరుగుతూ ఉండే ఆంత్రం (పేగు)కు అనుసంధానమై 'ఎలనాటిస్' (Allanotis)అనే పలుచని పొర ఉంటుంది.
ఈ పొర ద్వారానే పక్షి పిండం శ్వాసిస్తుంది. ఈ పొర టమోటా సాస్‌లాగా ఒక మడతపై మరొకటి పరుచుకొని వలలోని అల్లికలాగా సున్నితమైన రక్తనాళాలు కలిగి ఉంటుంది.
వాతావరణంలోని ఆక్సిజన్ ఈ రక్తనాళాల ద్వారా వెలుపల నుండి గుడ్డులోకి ప్రవేశిస్తుంది. అలాగే లోపల నుండి కార్బన్ డై ఆక్సైడ్ వెలుపలికి పోతుంది.
ఈ 'ఎలనాటిస్', సృష్టి ఆరంభంలో ప్రాణులు సముద్రాల నుండి భూమిపైకి వచ్చి రూపాంతరం చెందడంతో ప్రముఖ పాత్ర వహించింది. చేపలు, ఉభయచరాలైన కప్పల వంటి ప్రాణుల గుడ్లలో ఇది ఉండదు.
కాని పక్షులు, పాకుడు జంతువులైన పాముల గుడ్లలో ఉంటుంది. పాలిచ్చే ప్రాణులు, ముఖ్యంగా మానవులలో ఈ ఎలనాటిస్ బొడ్డుతాడు (Umbilical cord) రూపంలో వృద్ధి చేందుతుంది.