అస్సాం రాష్ట్రంలో ఓ ప్రభుత్వ వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా గర్భిణీ మహిళ పరిస్థితి విషమంగా మారింది. వివరాల్లోకి వెళితే.. నవీ నమసూద్ర అనే ఏడు నెలల గర్భిణి స్త్రీ కడుపులో నొప్పి రావడంతో కరీంగంజ్ లోని గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళింది.
అక్కడ గైనకాలజిస్ట్‌గా పనిచేస్తున్న ఆశిష్ కుమార్ విశ్వాసం అనే వైద్యుడు, ఆమెకు ఎందుకు కడుపునొప్పి వచ్చింది అన్నది గుర్తించకుండా, ప్రసవ నొప్పులుగా భావించి సరైన టెస్టులు నిర్వహించకుండా గర్భిణీ మహిళకు సిజేరియన్ నిర్వహించారు.
ఇక పసికందును బయటకు తీసిన వైద్యుడు, పిండం పూర్తిగా అభివృద్ధి చెందలేదని గుర్తించారు. దీంతో గుట్టు చప్పుడు కాకుండా ఆపై మళ్లీ పిండాన్ని పొట్టలోనే పెట్టి కుట్లు వేశారు. గర్భిణీ మహిళను ఇంటికి పంపించారు.
ఇక ఈ ఘటన జరిగిన పన్నెండు రోజుల తర్వాత సదరు గర్భిణీ ఆరోగ్య పరిస్థితి విషమించింది. తీవ్రమైన కడుపునొప్పితో బాధ పడుతున్న ఆమెను మళ్ళీ వేరే ఆసుపత్రికి తీసుకువెళ్లగా డాక్టర్ చేసిన నిర్వాకం బయటకు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. సదరు వైద్యుడిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.