కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడుగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ పగ్గాలు చేపట్టాలని ఆయన నంబర్ టెన్ జన్‌పథ్ నుంచి సంకేతాలు వెళ్లాయి. అయితే, ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు సమ్మతిస్తారా లేదా అన్నది తెలియాల్సివుంది. ఒకవేళ ఆయన విముఖత వ్యక్తం చేసినపక్షంలో ఆ రేసులో పార్టీ సీనియర్ నేతలైన అంబికా సోనీ, మల్లిఖార్జున ఖర్గే, వేణుగోపాల్, ముకుల్ వాస్నిక్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.
గత 2019లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ససేమిరా అంటున్నారు. దీంతో సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీకి పూర్తి స్థాయిలో కొత్త అధ్యక్షుడిని నియమించాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు.
ఇందులోభాగంగా, అశోక్ గెహ్లాట్‌ను మంగళవార జైపూర్ నుంచి ఢిల్లీకి పిలిపించి ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పార్టీ పగ్గాలు స్వీకరించాలని ఆయనకు సూచించారు. ఈ భేటీ జరిగిన కొన్ని గంటల్లోనే రాహుల్, ప్రియాంకా గాంధీలు విదేశాలకు పయనమైపోయారు. మరోవైపు, ఈ నెల 28వ తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంకానుంది. ఇందులో కొత్త అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన తేదీన ఖరారు చేసే అవకాశం ఉంది.