Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

Devendra Fadnavis నేడు ఫడ్నవిస్ పట్టాభిషేకం : డిప్యూటీ వద్దంటున్న ఏక్‌నాథ్ షిండే!

devendra fadnavis

ఠాగూర్

, గురువారం, 5 డిశెంబరు 2024 (09:16 IST)
Devendra Fadnavis to take oath as Maharashtra CM today మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీలో బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్ కూర్చోనున్నారు. అదేసమయంలో ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నిరాకరిస్తున్నారు. 
 
ఈ మేరకు బుధవారం జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఫడణవీస్ పేరును ప్రతిపాదించగా.. ఏకగ్రీవంగా ఆమోదించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. డిసెంబరు 5వ తేదీన ఆయన మహారాష్ట్ర సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలిపాయి. 
 
కోర్ కమిటీ భేటీ తర్వాత ముంబైలోని విధాన్ భవన్‌లో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా ఉన్న నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ హాజరయ్యారు. సీఎం ఎంపికపై పార్టీ ఎమ్మెల్యేలతో వారు చర్చించారు. అనంతరం బీజేపీ శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవిస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శాసనసభలో మహాయుతి కూటమికి కూడా ఆయనే నేతృత్వం వహించేందుకు పార్టీల మధ్య అంగీకారం కుదిరింది. దీంతో సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణస్వీకారానికి మార్గం సుగమమైందని సదరు వర్గాలు తెలిపాయి.
 
మరోవైపు, గురువారం ఆజాద్ మైదానంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ సహా ఎన్డీయే కీలక నేతలు హాజరుకానున్నారు. సీఎంగా ఫడ్నవిస్‌తో పాటు శివసేన నేత ఏక్‌నాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్‌లు ఉప ముఖ్యమంత్రులుగా
ప్రమాణస్వీకారం చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే, ఏక్‌నాథ్ షిండే మాత్రం ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు నిరాకరిస్తున్నారు. 
 
288 శాసనసభ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఏకంగా 230 స్థానాలతో భారీ మెజార్టీ దక్కించుకుంది. అయితే, ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటుపై కూటమిలో ప్రతిష్టంభన నెలకొంది. సీఎం ఎంపిక, శాఖల కేటాయింపులపై భాజపా, శివసేన, ఎన్సీపీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించని ఏక్‌నాథ్ షిండే, హోంశాఖ కేటాయించాలని పట్టుబట్టినట్లు వార్తలు వచ్చాయి. దీంతో కేంద్రంలోని బీజేపీ అధిష్ఠానం రంగంలోకి దిగి బుజ్జగింపులు మొదలు పెట్టింది. చివరకు ఆ చర్చలు ఫలించడంతో గురువారం మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Water sports in Hussain Sagar : జూపల్లి చేతుల మీదుగా ప్రారంభం