ఢిల్లీలో ఆమానుష ఘటన ఒకటి జరిగింది. కుక్కకు సారీ చెప్పలేదనీ ముగ్గురు యువకులు ఓ ట్రక్కు డ్రైవర్‌ను కత్తులతో పొడిచి చంపశారు. ఈ దారుణం ఢిల్లీలో జరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలో సంచలనంగా మారిన ఈ ఘటనను పరిశీలిస్తే, స్థానిక ఉత్తమ్‌నగర్ ప్రాంతంలో అంకిత్, పరాస్, దేవ్ చోప్రా అనే ముగ్గురు స్నేహితులు కలిసి ఆదివారం సాయంత్రం తమ పెంపుడు కుక్కతో కలిసి వ్యాహ్యాళికి వెళ్లారు. ఈ క్రమంలో విజేందర్ రాణా అనే డ్రైవర్ తన ట్రక్కుతో అతివేగంగా వాహనంతో వారి పక్కనే దూసుకెళ్లాడు. ఆ ట్రక్కు వేగానికి భయపడిన కుక్క, ట్రక్కును చూసి మొరిగింది.
దీంతో వెంటనే ఆ వారంతా ట్రక్కును వెంబడించి అడ్డుకున్నారు. తమ కుక్కకు క్షమాపణ చెప్పిన తర్వాతే ముందుకు వెళ్లాలని రాణాకు ముగ్గురూ హుకుం జారీ చేశారు. తాను ఏ తప్పూ చేయలేదనీ అందువల్ల కుక్కకు సారీ చెప్పే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. దీంతో ముగ్గురూ కలిసి స్క్రూడ్రైవర్లు, కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు.
ఇంతలో రాణా సోదరుడు రాజేష్ అక్కడకు చేరుకుని అన్నను కాపాడేందుకు ప్రయత్నించాడు. అయితే, అతన్ని కూడా కత్తులతో పొడిచారు. ఈ దాడిలో రాణా అక్కడికక్కడే మరణించగా రాజేష్ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ అమానుష ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.