ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న పసుపు కుంకుమ పథకానికి ఢిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ, పెన్షనర్లకు నగదు పంపిణీ చేయవచ్చని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.
ఈ పథకాలు పాతవి కావడంతో నగదు పంపిణీని నిలిపివేయాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఎన్నికల సమయంలో ఈ పథకాలు లబ్ధిదారులకు అమలుకాకుండా చూడాలని కోరుతూ జనచైతన్య వేదిక కన్వీనర్ లక్ష్మణరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది వినిపించిన వాదనను ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇప్పటికే ఈ పథకాలు అమలులో ఉన్నందున లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బు పంపడం ఈసీ కోడ్ పరిధిలోకి రాదని కోర్టు తెలిపింది. అలాగే, ఈ అంశంపై ఢిల్లీ హైకోర్టులో ఎందుకు పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చిందని అడిగింది.
ప్రభుత్వ పథకాలు ఇప్పటికే అమలులో ఉన్నప్పుడు దానికి సంబంధించిన విషయంలో ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని పిటిషనర్‌ను ప్రశ్నించింది. ప్రతిసారి ఇలాంటి వాటిని కోర్టుల దృష్టికి తీసుకొచ్చి విలువైన సమాయాన్ని ఎందుకు వృథా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది.