ముదిమి వయసులో డేటింగ్ : మాయమాటలు చెప్పి ముంచేసిన యువతి

సోమవారం, 1 ఏప్రియల్ 2019 (12:43 IST)
ఓ యువతిపై ఆశపడిన 65 యేళ్ళ వృద్ధుడు మోసపోయాడు. లేటు వయసులో డేటింగ్‌కు ఆశపడ్డాడు. చివరకు డేటింగ్ సంగతేమోగానీ తాను మాత్రం ఏకంగా రూ.46 లక్షలు మోసపోయాడు. ఈ ఘరానా మోసం న్యూఢిల్లీలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, న్యూఢిల్లీకి చెందిన వృద్ధుడు, ఓ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోగా, తొలుత మీరా అనే యువతి నుంచి ఫోన్ వచ్చింది. ప్రీమియం మెంబర్‌గా రిజిస్టర్ కావాలని కోరింది. దీంతో ఆ పని చేశాడు. ఇందుకోసం కొంత మొత్తం సొమ్ముకూడా చెల్లించాడు. 
 
ఆపై ముగ్గురు మహిళల ఫొటోలను పంపగా, ఒకరిని ఎంచుకున్నాడు. ఆమెతో యేడాది డేటింగ్ చేసేందుకు రూ.10 లక్షలు కట్టాలని చెబితే, ఆశతో ఆ డబ్బు కట్టాడు. ఆపై తాను ఎంపిక చేసుకున్న మహిళ రోజీ అగర్వాల్ నుంచి ఫోన్ వచ్చింది. ఆమె కూడా సాకులు చెబుతూ భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసింది. అడిగినప్పుడల్లా డబ్బు పంపుతున్నప్పటికీ ఆమె మాత్రం డేటింగ్‌కు రాలేదు. 
 
ఆపై తాను మోసపోయానని గ్రహించి.. తన పేరును రిజిస్టర్ చేసుకున్న వెబ్‌సైట్‌ను పరిశీలించాడు. అది మోసపూరిత వెబ్‌సైట్ అని తేలింది. దీంతో పరువు పోతుందని భావించిన ఆయన కొన్ని నెలల పాటు మౌనంగా ఉండి, చివరకు కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో, వారు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ వ్యక్తి డబ్బులు చెల్లించిన బ్యాంకు ఖాతాలు, మొబైల్ నంబర్ల ఆధారంగా పోలీసులు కూపీ లాగుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం మండు వేసవి... నేపాల్‌లో తుఫాను-25మంది మృతి