ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో హుటాహటిన ఆస్పత్రికి తరలించారు. ముఖ్యంగా, తీవ్రమైన జ్వరంతో పాటు.. శ్వాసపీల్చడం కష్టంగా మారడంతో మంత్రిని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. ప్రస్తుతం ఆయనకు 55 సంవత్సరాలు. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ ఉదయం వెల్లడించారు.
ఈ ట్వీట్‌లో 'గత రాత్రి నాకు తీవ్రమైన జ్వరం వచ్చింది. ఇదేసమయంలో నా శరీరంలోని ఆక్సిజన్ స్థాయి పడిపోయింది. నన్నిప్పుడు ఆసుపత్రిలో చేర్చారు. నా ఆరోగ్యంపై పూర్తి వివరాలు తదుపరి తెలియజేస్తాను' అని పేర్కొన్నారు.
కాగా, సోమవారం నాడు అమిత్ షా నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి సీఎం కేజ్రీవాల్‌తో పాటు సత్యేందర్ జైన్ కూడా హాజరు కావడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. మంత్రి ఆరోగ్యంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరా తీస్తున్నారు.