Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మూడు రాజధానుల ఏర్పాటు ఈ ప్రభుత్వ లక్ష్యం : ఏపీ గవర్నర్

మూడు రాజధానుల ఏర్పాటు ఈ ప్రభుత్వ లక్ష్యం : ఏపీ గవర్నర్
, మంగళవారం, 16 జూన్ 2020 (11:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల ఏర్పాటే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ హరిచందన్ ప్రసంగిస్తూ, పరిపాలన వికేంద్రీకరణ అత్యంత కీలకమన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే తన ప్రభుత్వ ఉద్దేశమన్నారు. 
 
ప్రస్తుతం మూడు రాజధానుల బిల్లు శాసన ప్రక్రియలో ఉందని గుర్తుచేశారు. మూడు రాజధానులకు తన ప్రభుత్వం కట్టుబడివుందని స్పష్టం చేశారు. అమరావతి శాసన రాజధానిగా, విశాఖపట్నం కార్య నిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో తమ ప్రభుత్వానికి మంచి రోజులు వస్తాయని, ఈ బిల్లు కూడా ఆమోదం పొందుతుందని ఆయన అన్నారు. 
 
అంతేకాకుండా, తమ ప్రభుత్వం ఇప్పటివరకు రాష్ట్రంలోని 3.98 కోట్ల మందికి వివిధ పథకాల ద్వారా లబ్ది జరిగిందని, అందుకు రూ.42 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని గవర్నర్ వ్యాఖ్యానించారు. గత సంవత్సరంతో పోలిస్తే తలసరి ఆదాయం 12 శాతం పెరిగిందని, ఆరోగ్యశ్రీ పథకం కింద 6.25 లక్షల మందికి రూ.1,200 కోట్లకు పైగా సాయం చేశామన్నారు. 
 
అదేవిధంగా, వైఎస్ఆర్ ఆసరా కోసం రూ.1,534 కోట్లు, కంటివెలుగు కోసం రూ.53.85 కోట్లను కేటాయించామని తెలిపారు. ప్రతి గ్రామ సచివాలయం వద్దా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇక్కడి నుంచి 541 సేవలను అందిస్తున్నామని వెల్లడించారు. జగనన్న విద్యా కానుక ద్వారా విద్యార్థులకు కిట్స్ అందించేందుకు రూ.656 కోట్లను కేటాయించామని, ఈ పథకం ద్వారా 39.70 లక్షల మంది చదువుకునే పిల్లలకు లబ్ది చేకూరనుందని తెలిపారు.
 
కాగా, మూడు రాజధానుల అంశంలో మాత్రం ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదని గవర్నర్ ప్రసంగం ద్వారా తెలుస్తోంది. ఈ బిల్లును తమకు బలం ఉన్న అసెంబ్లీలో ఆమోదించుకున్న వైఎస్ జగన్ సర్కారు, మండలిలో మాత్రం నెగ్గించుకోలేక పోయిందన్న సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలోనే గవర్నర్ తన ప్రసంగంలో శాసన ప్రక్రియలో బిల్లు ఉందని వ్యాఖ్యానించారని భావించవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదే సమయంలో మరికొన్ని నెలల్లో మండలిలో సైతం వైసీపీకి బలం పెరుగుతుందని, అప్పుడు ఈ బిల్లుకు ఆమోదం లభిస్తుందని విశ్లేషిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నల్లచొక్కా ధరించి అసెంబ్లీకి వచ్చిన చంద్రబాబు - గవర్నర్ ప్రసంగం బాయ్‌కట్