రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆన్‌లైన్‌లో రాజ్ భవన్ నుండి ప్రసంగించనుండగా ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రాష్ట్ర ప్రధమ పౌరుడు ఆన్ లైన్ ప్రసంగం ద్వారా రాష్ట్ర శాసన మండలిని ఉద్దేశించి ప్రసంగించటం దేశ చరిత్రలోనే తొలిసారి.
కరోనా వ్యాప్తి నేపధ్యంలో భౌతిక దూరం పాటించవలసి ఉండగా, గవర్నర్ హరిచందన్ ఈ ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా శాసన సభ బడ్జెట్ సమావేశాల నేపధ్యంలో గవర్నర్ శాసన మండలికి స్వయంగా వచ్చి రాష్ట్ర శాసన సభ, శాసన పరిషత్తులలోని సభ్యులందరినీ ఉద్దేశించి ప్రసంగించటం అనవాయితీ. ప్రస్తుత విపత్కర పరిస్ధితుల కారణంగా గౌరవ గవర్నర్ వైద్యపరమైన ప్రోటోకాల్‌ను పాటిస్తూ నూతన సాంప్రదాయానికి నాంది పలికారు.
ఈ క్రమంలో సోమవారం రాజ్ భవన్ నుండి ఉన్నతాధికారులు ఆన్‌లైన్ వ్యవస్థకు సంబంధించిన ముందస్తు రిహార్సల్ నిర్వహించారు. సాంకేతిక అంశాలపై గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఐటి, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంగళవారం నాటి కార్యక్రమం లోపరహితంగా ఉండేలా చూడాలని విద్యుత్ పరమైన ఆటంకాలు లేకుండా సమన్వయం చేసుకోవాలని దిగువ స్థాయి అధికారులకు ఆదేశించారు.
రాజ్ భవన్ నుండి గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ విజయ కుమార్ రెడ్డి, ముఖ్య సమాచార ఇంజనీర్ మధుసూధన్ తదితరులు, అసెంబ్లీ ప్రాంగణం నుండి శాసన మండలి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు ఆన్ లైన్ విధానంలో ప్రత్యక్షంగా పాల్గొని వ్యవస్థ పనితీరును సమీక్షించారు. రాష్ట్ర ఐటి శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ సంయుక్తంగా ఆన్‌లైన్ వ్యవస్థను పర్యవేక్షిస్తున్నాయి.
శాసన సభలో శాసన సభ్యులు, శాసన పరిషత్తులో ఎంఎల్‌సిలు వేర్వేరుగా కూర్చుని గవర్నర్ ప్రసంగాన్ని విననున్నారు. ఇందుకోసం ఆయా సభలలో ప్రత్యేకంగా గోడ తెరలను ఏర్పాటు చేసారు. పది గంటలకు జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభం కానుండగా, గౌరవ ప్రధమ పౌరుని ప్రసంగం తదుపరి జాతీయ గీతంతో ఆన్‌లైన్ ప్రసంగం కార్యక్రమం ముగుస్తుంది.