Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓట్లు చీలిపోతాయనీ ఢిల్లీ పోల్స్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకోలేదు.. కాంగ్రెస్

Advertiesment
ఓట్లు చీలిపోతాయనీ ఢిల్లీ పోల్స్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకోలేదు.. కాంగ్రెస్
, మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (11:54 IST)
ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలను తాము ప్రతిష్టాత్మకంగా తీసుకోలేదని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధులు సెలవిస్తున్నారు. ఎందుకంటే.. తాము సీరియస్‌గా ప్రచారం చేసివున్నట్టయితే తప్పకుండా ఓట్లు చీలిపోయి అంతిమంగా భారతీయ జనతా పార్టీకి లబ్ది చేకూరివుండేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇపుడు తాము తీసుకున్న నిర్ణయంతో బీజేపీ అధికారంలోకిరాకుండా అడ్డుకోవడంతో ఆప్ విజయభేరీ మోగించనుందని వారు తమదైనశైలిలో వివరణ ఇస్తున్నారు. 
 
ఈనెల ఎనిమిదో తేదీన జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమైంది. మొత్తం 70 సీట్లున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 57 స్థానాల్లో బీజేపీ 13 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం సున్నా స్థానానికే పరిమితమైంది. 
 
ఈ ఎన్నికల ట్రెండ్‌పై కాంగ్రెస్ ప్రతినిధులు స్పందించారు. ముఖ్యంగా, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడైన వెంటనే వారు స్పందించారు. ఈ దఫా కూడా ఆప్‌దే విజయమని తాము అంచనా వేశామని తెలిపారు. తాము కావాలనే ఎన్నికల్లో భారీగా ప్రచారం చేయలేదనీ, ఒకవేళ అలా చేస్తే ఓట్లు చీలిపోయి పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. 
 
అయితే, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోదగిన నేత కనిపించడం లేదు. మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ చనిపోయిన తర్వాత ఆ లోటు ఢిల్లీ కాంగ్రెస్‍‍లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నిజానికి షీలా దీక్షిత్ ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ మూడు సార్లు అంటే 15 యేళ్ల పాటు ఢిల్లీ పీఠాన్ని పాలించింది. 
 
ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత 2013లో దాదాపు 24 శాతం ఓటు బ్యాంకు కలిగిన కాంగ్రెస్ పార్టీ 2015 నాటికి ఓటు బ్యాంకు 10 శాతానికి పడిపోయింది. ఈసారి ఫలితాలను విశ్లేషిస్తే పరిస్థితి మరింతగా దిగజారి కేవలం 4.25 శాతానికే పరిమితమైనట్టు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రాలో బీటెక్ కోర్సులకు రూ.2 లక్షల ఫీజు?