కేరళ రాష్ట్రంలో ఇడుక్కిలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూ వుంది. ఈ ఘటనలో మొత్తం మృతుల సంఖ్య 54కి చేరింది. ఈ ప్రమాదం అనంతరం గల్లంతైన వారిలో మరో 16మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ నెల 8న ఇడుక్కి జిల్లాలోని రాజమల ఏరియాలో కొండచరియలు విరిగిపడటంతో పలువురు ఆ శిథిలాల కింద చిక్కుకున్నారు.
అప్పటి నుంచి అక్కడ ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాలను తొలగిస్తున్నా కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. తాజాగా బుధవారం మరో రెండు మృతదేహాలను వెలికి తీయడంతో ఆ ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 54కు చేరింది.
ఇదిలా ఉండగా మృతుల బంధువులకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ శుక్రవారం రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేసి, జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి మరణించిన వారి బంధువులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆయా ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి.