తన భర్త, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్ నాలుగో దశలో ఉన్నట్టు తాజాగా తేలింది. దీంతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమతో పాటు... ఖల్‌నాయక్ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలుపడి ఇపుడు తన కుటుంబంతో హాయిగా జీవిస్తున్న సంజూ భాయ్‌కు మళ్లీ మరో కష్టమా అంటూ ప్రతి ఒక్కరూ అంటున్నారు. దీనిపై సంజయ్ దత్ భార్య మాన్యత స్పందించారు.
సంజయ్ దత్ కోసం ప్రార్థనలు చేస్తున్న అభిమానులు, శ్రేయోభిలాషుల కోసం ప్రత్యేక సందేశం వెలువరించారు. సంజూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు సందేశంలో పేర్కొన్నారు.
'ఈ దశను అధిగమించడానికి మాకు మరింత బలం, ప్రార్థనలు అవసరం. గతంలో మా కుటుంబం అనేక ఆటుపోట్లు చవిచూసింది. ప్రతిసారి నిలదొక్కుకున్నాం. ఇప్పుడు కూడా ఈ కష్టాన్ని అధిగమిస్తామన్న నమ్మకం ఉంది.
ఈ సమయంలో సంజూ అభిమానులందరికీ చెప్పేదొక్కటే... దయచేసి పుకార్లను నమ్మకండి, ఆధారాల్లేని ఊహాగానాలపై ఆధారపడకండి. కానీ ఎప్పట్లాగానే మీ అపారమైన ప్రేమాభిమానాలను మాపై చూపండి. మీ విశేషమైన మద్దతును మాకు అందించండి.
సంజూ ఎప్పుడూ ఓ పోరాట యోధుడు. అందుకే దేవుడు మరోసారి మమ్మల్ని పరీక్షించాలని భావించాడు. మాకు కావాల్సిందల్లా మీ ఆశీస్సులు, మీ ప్రార్థనల బలమే. తప్పకుండా ఈ పరిస్థితులను జయిస్తామని తెలుసు. ఈ సందర్భాన్ని మనం సానుకూల దృక్పథాన్ని, ఆశావహ ధోరణిని వ్యాప్తి చేసేందుకు ఉపయోగించుకుందాం' అంటూ ఆమె పిలుపునిచ్చారు.
యువరాజ్ సంఘీభావం
మరోవైపు, సంజయ్ దత్‌కు టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సంఘీభావం ప్రకటించారు. గతంలో క్యాన్సర్ బారినపడి కోలుకున్న యువరాజ్ తాజాగా తన సందేశాన్ని వెలువరించారు. క్యాన్సర్‌తో వ్యవహారం ఎలా ఉంటుందో తనకు తెలుసని, ఆ నొప్పిని స్వయంగా అనుభవించి, భరించానని పేర్కొన్నారు.
"సంజయ్ దత్... ఇప్పుడు మీరు కూడా ఓ ఫైటర్‌లా పోరాడాలి. మీరు మనసును మరింత దృఢంగా మలుచుకోవాలి. మీరు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను" అంటూ ట్విట్టర్‌లో స్పందించారు.
కాగా, అప్పట్లో క్యాన్సర్‌కు చికిత్స కోసం యువరాజ్ సైతం అమెరికా వెళ్లారు. ఇప్పుడు సంజయ్ దత్ కూడా అమెరికా వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా తాను చేస్తున్న పనుల నుంచి తాను కాస్తంత విరామం తీసుకుంటున్నట్టు ప్రకటించారు.