Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముంచుకొస్తున్న తౌక్టే: 175 కిలోమీటర్ల వేగంతో గాలులు, రాయలసీమలో వర్షాలు

ముంచుకొస్తున్న తౌక్టే: 175 కిలోమీటర్ల వేగంతో గాలులు, రాయలసీమలో వర్షాలు
, శనివారం, 15 మే 2021 (13:05 IST)
లక్షద్వీప్‌ వద్ద అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారింది. ‘తౌక్టే’గా పేరు పెట్టిన ఈ  తుపాను ఆదివారం అత్యంత తీవ్రంగా మారుతుందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది.
 
ఈనెల 18న గుజరాత్‌ వద్ద తీరాన్ని దాటే అవకాశముందని తెలిపింది. ఈ క్రమంలో గంటకు 150 నుంచి 175 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని అప్రమత్తం చేసింది. ‘తౌక్టే’ కారణంగా కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని అధికారులు హెచ్చరించారు.

తుపాను ధాటికి ఇప్పటికే కొల్లాం జిల్లాలో అనేకచోట్ల చెట్లు నేలకూలాయి. వందల ఇళ్లు దెబ్బతిన్నాయి. కొండచరియలు ఎక్కువగా ఉన్న వయనాడ్‌, ఇడుక్కి జిల్లాల్లో ప్రాణనష్టం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు జాతీయ విపత్తు స్పందనా దళం అధికారులు తెలిపారు. తుపాను ప్రభావాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు కేరళ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌, మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో 53 బృందాలను మోహరించినట్టు ఆ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌.ఎన్‌.ప్రధాన్‌ తెలిపారు.
 
రాయలసీమకు భారీ వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. దక్షిణ కోస్తాంధ్రలో, రాయలసీమలో ఈ రెండు రోజులు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. రాయలసీమలో అనేక చోట్ల భారీ వర్షాలకు అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
 
ఒకరోజు ముందుగానే కేరళకు రుతుపవనాలు!
 ఈ ఏడాది ఒకరోజు ముందుగా... ఈనెల 31నే నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశముందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం వెల్లడించింది. రుతుపవనాలు మొట్టమొదట ఈనెల 22న దక్షిణ అండమాన్‌లోని సముద్ర ప్రాంతానికి చేరనున్నాయి. అనంతంరం వాయవ్య దిశగా ముందుకు కదులుతాయని ఐఎండీ పేర్కొంది. దేశంలో ఈ ఏడాది సాధారణ వర్షపాతమే నమోదవుతుందని అంచనా వేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏ రాష్ట్రం నుంచైనా కరోనా రోగులు తెలంగాణకు రావచ్చు, కానీ...: డీహెచ్‌