Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్ గులాబీలు కావాలా ? గుజరాత్ గులాములు కావాలా ?: మంత్రి కేటీఆర్

హైదరాబాద్ గులాబీలు కావాలా ? గుజరాత్ గులాములు కావాలా ?: మంత్రి కేటీఆర్
, మంగళవారం, 24 నవంబరు 2020 (08:00 IST)
తెలంగాణ వస్తే హైదరాబాద్ నగరం ఆగమవుతది అని చేసిన అబద్దపు ప్రచారాలను పటాపంచలు చేస్తూ.. ఈ ఏడేళ్లలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబద్ నగరం అభివృద్ధిలో దూసుకొని పోతోందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 

మహేశ్వరం, ఎల్ బీ నగర్ నియోజక వర్గ పరిధిలో నిర్వహించిన రోడ్ షోలకు పెద్దఎత్తున హాజరైన ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ రాకముందు హైదరాబాద్ నగరంలో పరిస్థితులు ఏ విధంగా ఉండేవో ప్రజలు ఆలోచించాలన్నారు. ఈ ఐదేళ్ల కోసం ప్రజలను ఓటు అడిగే ముందు గత ఐదేళ్లలో హైదరాబాద్ నగరం కోసం ఏమేం చేశామో చెప్పాల్సిన భాద్యత తమ మీద ఉందన్నారు 

రాష్ట్రం వచ్చినప్పుడు ఆరేండ్ల కిందట పవర్ హాలీడేలతో, మంచినీటి కష్టాలతో పడ్డ ఇబ్బందులు ప్రజలకు ఇంకా గుర్తున్నాయన్నారు. తెలంగాణ వస్తే ఏమైపోతుందో అన్న విష ప్రచారాలు, టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే గిల్లి కజ్జాలు పెట్టుకుంటారని దిక్కుమాలిన ప్రచారాలు చేసిన సంగతి మర్చిపోలేదన్నారు. 
 
కానీ ఇదే ఆరేళ్లలో ఏం జరిగిందో ఒక్కసారి ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. తెలంగాణ రాకముందు హైదరాబాద్ నగరంలో మంచి నీటి సమస్య ఎలా ఉండేదో ఒకసారి ప్రజలు గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి మంచినీళ్లు వచ్చే పరిస్థితి.  మంచి నీటి ట్యాంకర్ల దగ్గర యుద్దాలు మరిచిపోలేదన్నారు.

అలాంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నాయా అని ప్రజలను ప్రశ్నించారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల కనీస అవసరమైన మంచినీటి కష్టాలను తీర్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. తెలంగాణ వచ్చేటప్పటికీ కరెంటు కష్టాలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. వారానికి రెండు రోజులు పవర్ హాలిడేలు ఉండేవన్నారు.

నాణ్యమైన విధ్యుత్ లేక నగర ప్రజలు పడ్డ ఇబ్బందులు, ఇందిరా పార్కు వద్ద పరిశ్రమల యజమానులు చేసిన ధర్నాలు మర్చిపోవద్దన్నారు. ఒకప్పుడు కరెంటు వార్త, ఇప్పుడు కరెంటు పొతే వార్త.  ఈ రోజు నగర ప్రజలకు నాణ్యమైన నిరంతర కరెంటు అందుతుంది అంటే ఆ ఘనత సీఎం కేసీఆర్ నాయకత్వానిదేన్నారు 
 
నగర ప్రజల అవసరాల పట్ల అవగాహన ఉన్న నాయకుడు కేసీఆర్ గారన్నారు. వందేండ్ల కిందట 1920లో నిర్మించిన గండిపేట జలాశయం తప్ప ఇప్పటివరకు నగర ప్రజల అవసరాల కోసం ఏ ఒక్క పాలకుడు ఆలోచించలేదు అన్నారు. కానీ నగర ప్రజల అవసరాలు, భవిష్యత్ నగర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని దానికి రెట్టింపు సామర్థ్యంతో సీఎం కేసీఆర్ కేశవాపురం రిజర్వాయర్ ని నిర్మిస్తున్నారన్నారు.

ఈ రోజు నగరానికి ఆపిల్, అమెజాన్ వంటి కంపెనీలు క్యూ కడుతున్నాయి అంటే దానికి కారణం నగరంలో ఉన్న శాంతి భద్రత, సుస్థిర ప్రభుత్వం, మానవ వనరులే కారణం అన్నారు. కానీ ఇవే కంపెనీలు ఇతర కంపెనీలకు ఎందుకు వెళ్లడం లేదో నగర ప్రజలు ఆలోచించాలన్నారు.

నగరంలో పేద ప్రజల కోసం బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసుకున్నామని, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు తెచ్చుకున్నామని, ఆకలైతే 5 రూపాయలకే కడుపునిండా భోజనం పెడుతున్న అన్నపూర్ల సెంటర్లు ఉన్నాయన్నారు. 
 
దేశ ప్రధాని ఇటీవల లోకల్ లోకల్ అంటున్నాడని ఈ లెక్కన తెలంగాణలో పక్కా లోకల్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని, హైదరాబాద్ గులాబీలు కావాలా గుజరాత్ గులాములు కావాలా నగర ప్రజలు ఆలోచించాలన్నారు. ఈ ఆరేళ్లలో హైదరాబాద్ నగరం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు చెప్పడానికి వంద ఉన్నాయని, చెప్పుకుంటూ పొతే ఒక రోజు పడుతుందన్నారు.

కానీ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ నగరం కోసం కేంద్రం నుండి ఏం చేశాడో చెప్పాలన్నారు. ఓట్ల కోసం తమ వద్దకు వచ్చినప్పుడు అభివృద్ధి విషయంలో జాతీయ పార్టీలను నిలదీయాలన్నారు. ఇటీవల అమిత్ షా తెలంగాణకు వంద కోట్లు ఇచ్చామని గొప్పలు చెబుతున్నాడని వాస్తవాల్లోకి వెళ్లి లెక్కలు తీస్తే ఈ ఆరేళ్లలో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం వివిధ పన్నుల పద్ధతుల ద్వారా మనం చెల్లించిన సొమ్ము  2,72,000 కోట్ల రూపాయలు అనీ.. కానీ తిరిగి తెలంగాణకు కేంద్రం ఇచ్చింది కేవలం కేవలం 1,40,000 కోట్లు మాత్రమేనన్నారు.

మరి మిగిలిన పైసలు ఎక్కడ పోయాయో చెప్పాల్సిన భాద్యత బీజేపీ నాయకులకు ఉందన్నారు. తెలంగాణ ప్రజల సొమ్ముతో బీహార్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో అభివృద్ధి పనులు సాగుతున్నాయన్నారు. తెలంగాణ నుంచి ఢిల్లీకి పైన ప్రతి రూపాయలో కేవలం అర్ధరూపాయి మాత్రమే తిరిగి వస్తుందన్నారు. ఈ లెక్కన ఎవరు ఎవరికి ఇస్తున్నారో ప్రజలు ఆలోచించాలన్నారు 
 
మొన్నటి కరోనా నుండి నిన్నటి వరదల వరకు నగర ప్రజల వెంట ఉన్నది  టీఆర్ఎస్ పార్టీ నాయకులూ అన్న విషయం ప్రజలకు తెలుసన్నారు. వరద సహాయక చర్యల కింద వరదలతో ఇబ్బంది పడుతున్న నగర ప్రజలకు ప్రతీ కుటుంబానికి 10 వేల రూపాయలు పంపిణీ చేస్తుంటే వాటిని ఆపినదెవరో తెలియదా అంటూ ప్రజలను ప్రశ్నించారు.

కర్ణాటకలోని బెంగుళూరులో వరదలు వస్తే కేంద్రం 660 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. గుజరాత్ లో వరదలు వస్తే 500 కోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేసింది కానీ అదే వరదలు మన హైదరాబాద్ నగరంలో వస్తే సాయం కోసం కేసీఆర్ గారు కేంద్రానికి లేఖ రాస్తే ఇంతవరకూ కేంద్రం స్పందించలేదన్నారు.

తెలంగాణ ప్రజలు ఏం పాపం చేసిందో చెప్పాలన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ మొహం పెట్టుకొని హైదరాబాద్ నగర ప్రజలను ఓట్లు అడుగుతారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కేటీఆర్ నిలదీశారు.
 
2014లో జీరో అకౌంట్ ని తెరవండి ప్రతి ఒక్కరూ అకౌంట్లో 15 లక్షలు వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఈ రోజు దేశ ప్రజలను మోసం చేశారని ఈ లెక్కన బీజేపీ ప్రభుత్ఫ్వం మీద భారత ప్రజలు 132 కోట్ల చార్జీషీట్లు వేయాలన్నారు. హైదరాబాద్ నగరానికి ఏం చేశారో చెప్పమంటే కొందరు నాయకులు నగర ప్రజల మధ్య మతాల పేరుతొ విద్వేషాలు రెచ్చ గొడుతున్నారన్నారు బాధ్యతారాహిత్యంగా ప్రకటనలతో ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారన్నారు. 

కెసిఆర్  నాయకత్వంలో ప్రశాంతంగా అభివృద్ధి చెందుతూ పెట్టుబడులు తెచ్చుకుంటూ పురోగమిస్తున్న హైదరాబాద్ కావాలా అభివృద్ధి కావాలా అని ప్రజలను ఉద్దేశించి అన్నారు. ప్రశాంతమైన హైదరాబాద్ నగరంకోసం నగర ప్రజలు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోలవరం ఎప్పుడు పూర్తిచేస్తారో చెప్పకుండా అయ్య విగ్రహాలు పెట్టుకుంటానంటే ఎలా?: దేవినేని