Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పోలవరం ఎప్పుడు పూర్తిచేస్తారో చెప్పకుండా అయ్య విగ్రహాలు పెట్టుకుంటానంటే ఎలా?: దేవినేని

పోలవరం ఎప్పుడు పూర్తిచేస్తారో చెప్పకుండా అయ్య విగ్రహాలు పెట్టుకుంటానంటే ఎలా?:  దేవినేని
, మంగళవారం, 24 నవంబరు 2020 (07:55 IST)
పోలవరంప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లిన సీపీఐనేతలను ఎక్కడికక్కడ గృహనిర్బంధాలు చేయడం చూస్తుంటే, వైసీపీప్రభుత్వం తన అసమర్థత, చేతగానినిర్వాకాలను పోలీసులను అడ్డుపెట్టుకొని కప్పిపుచ్చుకుంటోందని మరోసారి అర్థమైందని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టంచేశారు. ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆవివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా ...!
 
 
టీడీపీప్రభుత్వం 600 బస్సులను ఏర్పాటు చేసి, రైతులను, సాగునీటిరంగ నిపుణులను, విద్యార్థులను, సామాన్యప్రజలను చాలాపెద్దఎత్తున పోలవరంప్రాజెక్ట్ సందర్శనకు తీసుకెళ్లింది. దాదాపు 12లక్షల మంది రైతులు పోలవరంప్రాజెక్ట్ నిర్మాణాన్ని దగ్గరుండీ మరీచూశారు. ఒక్కరోజే 35వేల మందిరైతాంగాన్ని  ఆనాడు డ్యామ్ సైట్ చూడటానికి అనుమతించాం.

నేడు వైసీపీప్రభుత్వం 15మందిని కూడా ఎందుకు అనుమతించడంలేదు? వందలాదిపోలీసులను కాపలాపెట్టుకొన్న ప్రభుత్వం తన అసమర్థత, అలసత్వాన్ని బయటపడకుండా చూసుకుంది. 18నెలల్లో తాముచేసిన నిర్వాకాలు ఎక్కడ బయటపడతా యోనన్న భయంతోనే  వైసీపీప్రభుత్వం ఈనాడు సీపీఐ నేతలను అడ్డుకుంది. టీడీపీ ప్రభుత్వంలో పోలవరం డ్యామ్ ని చూసినవారంతా  డయాఫ్రమ్ వాల్, స్పిల్ వేపనులు, కాపర్ డ్యామ్ పనులుచూసి ఆశ్చర్యపోయారు.

రాష్ట్రంలో ఏరైతుని అడిగినా చంద్రబాబు పోలవరంప్రాజెక్ట్ ప్రాంతంలో ఏంచేశాడో చెబుతాడు.  ముఖ్యమంత్రి ఒక్కరోజుకూడా పోలవరం ప్రాజెక్ట్ గురించి ఎందుకు మాట్లాడటంలేదు? ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రెండుసార్లు ఢిల్లీవెళ్లి ఏంసాధించాడో తెలియదు. మాట్లాడితే కేబినెట్ నోట్... కేబినెట్ నోట్ అంటున్నాడు. ఆయన ఇరిగేషన్ మినిస్టర్ ఎప్పుడయ్యాడో తెలియడంలేదు. 

డిఫ్యాక్టో ఇరిగేషన్ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లి రాజప్రాసాదంలో కూర్చొని ఏదేదో మాట్లాడుతాడు. ఇరిగేషన్ మంత్రి పొద్దునలేస్తే, కేబినెట్ నోట్ అంటాడు.. అధికారంలో ఆయనఉన్నాడా...లేక తామా? ఒకపక్క ప్రాజెక్ట్ అనుమతులు లాంఛనమని సొంతపేపర్ల లో వేసుకుంటూనే, మరోపక్క కేబినెట్ నోట్ అని ఎలా మాట్లాడతారు?

నాబార్డు రుణం తీసుకోవడానికి, ఆనాడు కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం ప్రకారం, ఏప్రిల్ -1, 2014 నుంచి ఇరిగేషన్ కాంపోనెంట్ ఎంతఖర్చవుతుందో, ఆ మొత్తం 2013 భూసేకరణచట్టంప్రకారం తామేభరిస్తామని ఆనాటికేంద్ర జలవనరులశాఖా మంత్రి, చంద్రబాబు , ఢిల్లీ మీడియా సమక్షంలో ఒప్పుకున్నారు.

ల్యాండ్ అక్విజేషన్, ఆర్ అండ్ ఆర్ ఖర్చుని కేంద్రమే భరిస్తుందని ఆనాడు మంత్రిచెబితే, చేతిలో 28 మంది ఎంపీలను ఉంచుకున్న అధికారపార్టీ, నిధులు రాబట్టుకోవడం చేతగాక, బూతులు మాట్లాడిస్తోంది. మరో ఇరిగేషన్ మంత్రి విజయసాయిరెడ్డి విశాఖపట్నంలోకూర్చొని 2021కి అవుతుందని, షెడ్యూల్ ప్రకారం అవుతుందని చెబుతున్నాడు.

నిధుల గురించి వై.ఎస్ జగన్ ప్రధానిని కలిశారని, అందుకు తగినట్లుగా సవరించిన అంచనాలప్రకారం రూ.55,548కోట్లకు గ్రీన్ సిగ్నల్ లభించిందని,  ఇది తనతండ్రి కష్టానికి జగన్ సాధించినఫలితమని, చేసినఖర్చులకు లెక్కలుచూపని చరిత్ర టీడీపీవారిదని ట్వీట్లు పెట్టాడు. మేం లెక్కలుచూపకుండా మొండికేస్తే, 18నెలలనుంచీ విజయసాయి ఏం గడ్డి పీకుతున్నాడు?

ఇరిగేషన్ మంత్రి అనిల్, ఢిఫ్యాక్టో ఇరిగేషన్ మంత్రి సజ్జల, వైసీపీఎంపీలు ఢిల్లీలో ఏంచేస్తున్నారు? కాగితాలు వారిదగ్గరలేవా? లేవంటే, వారుఅసమర్థులని ఒప్పుకుంటే, నేనే ఆకాగితాలు కూడా చూపిస్తాను. చంద్రబాబునాయకత్వంలో పోలవరం సందర్శనకు వెళ్లిన ప్రతిఒక్కరూ తమప్రాంతానికి గోదావరి జలాలు వస్తాయని మురిసిపోయారు.

ఈ దద్దమ్మ ప్రభుత్వం 15 మందివామపక్షాల నాయకులను పోలవరానికి పంపడానికి భయపడింది. అధికారపార్టీ ఎమ్మెల్సీ మాత్రం డ్యామ్ సందర్శనకు వెళ్లాడు. ఎందుకుంటే అతను మీకు అనుకూలంగా, మీ తండ్రికి, తాతలకు అనుకూలంగా డబ్బాలు కొడతాడు కదా.. అందుకని అతన్ని అనుమతించారు. టీడీపీప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి 25-05-2019నాటికి, రూ.16,673కోట్లు ఖర్చుచేసినట్లు, మీరే, మీఫొటోలతో ప్రకటనలిచ్చారు. 

గతంలో పోలవరాన్ని జాతీయప్రాజెక్ట్ గా ప్రకటించకముందు, రూ.5,135కోట్లు ఖర్చు చేయబడ్డాయి.   జగన్ తండ్రి వై.ఎస్ హయాంలో రూ.5,135కోట్లలో ల్యాండ్ అక్విజేషన్, రీహాలిబిటేషన్, ఆర్ అండ్ఆర్ కి  ఎంత ఖర్చుచేశారో జగన్ చెప్పగలడా? అలానే రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల హాయాంలో ఎంతఖర్చుచేశారో చెప్పగలరా?

ముగ్గురు ముఖ్యమంత్రుల పదేళ్లపాలనలో పోలవరం ప్రాజెక్ట్ లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్లో ఎంతమేరకుపనులుచేశారో, ఏఏపనులకు ఎన్నికోట్లు ఖర్చుచేశారో జగన్ చెప్పగలడా? 2014 తర్వాత టీడీపీప్రభుత్వం ఐదేళ్లలో రూ.11,537కోట్లు ఖర్చుపెట్టింది.  దమ్ముగా, ధైర్యంగా, నిజాయితీతో తాము చేసినపనులు, ఖర్చుచేసిన మొత్తం గురించి చెప్పుకుంటున్నాం. 

1941లో ప్రారంభమైన పోలవరం ప్రాజెక్ట్ కి, రాష్ట్రం ఏర్పడ్డాక ఆతరువాత నుంచి ప్రాజెక్ట్ నిర్మాణానికి ఖర్చుచేసిన లెక్కలను కూడాచూస్తే, టీడీపీప్రభుత్వం పెట్టిందే ఎక్కువ. తనతండ్రి వై.ఎస్ హయాంలో గానీ, రోశయ్య, కిరణ్ కుమార్ ల హయాంలో గానీ దేనికెంత ఖర్చచేశారో, ఎంతపనులు జరిగాయో చెప్పే దమ్ము, ధైర్యం జగన్ కు ఉన్నాయా? 

ఊరికే గొప్పలుచెప్పుకోవడం మానేసి, 2021 డిసెంబర్ కిఏం పొడుస్తారో చెప్పండి. 150 అడుగుల ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ఎత్తు ప్రకారం 2021 డిసెంబర్ కి ఈప్రభుత్వం నీళ్లు నిలబెట్టగలదా?  సుమారు 5వేలఎకరాలను భూమికి భూమికింద తీసుకోవాల్సి ఉంది. అది 2021 నాటికి తీసుకోగలరా? పాదయాత్రలో నిర్వాసితులకు రూ. 10లక్షలిస్తాను.. రూ.20లక్షలిస్తాను అని డబ్బాలుకొట్టాడు.

ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చాడు. అధికారంలోకి వచ్చాక దానికి సంబంధించిన జీవో ఇచ్చారా? వరదబాధితులకు రూ.5వేల పరిహారం ఇస్తామన్నారు... ఇంతవరకు అతీగతీలేదు. ఉభయగోదావరి జిల్లాల్లోని ఏడు ముంపుమండలాల్లోని నిర్వాసితులు దగ్గరకువెళ్లి, ఉత్తరకుమార మంత్రి అనిల్ బహిరంగ సభపెడితే, అక్కడున్నవారే ఆయనకుసమాధానం చెబుతారు.

జగన్మోహన్ రెడ్డి అయినా, ఇరిగేషన్ మంత్రి అయినాసరే, దమ్ము, ధైర్యంగా ఏడుముంపు మండలాల్లోని వారిదగ్గరకు వెళ్లి, తాము 135 అడుగులకే పోలవరం డ్యామ్ నిర్మిస్తున్నామని చెప్పగలరా?  వారిముందుకెళ్లి మాట్లాడితే, పోలవరం నిర్వాసితుల ఆగ్రహం ఏమిటో, బాధేమిటో తెలుస్తాయి. టీడీపీప్రభుత్వంలో 72శాతం పనులుజరిగితే, ఎక్కడైందని మాట్లాడతారా? 20శాతం, 30శాతం పనులు జరిగితే, 2021 డిసెంబర్ నాటికి, ఆ ప్రకారం జరిగిన పనులమీదనే గేట్లు బిగిస్తారా? 
 
11వతేదీన జరిగిన పోలవరం రివ్యూసమావేశంలో, 41.15 మీటర్లకే, 135 అడుగులకే ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పరిమితం చేస్తున్నట్లు, ప్రభుత్వం చాలాస్పష్టంగా చెప్పింది. 150అడుగుల ఎత్తుప్రకారం ప్రాజెక్ట్ నిర్మాణం చేపడితే, ఏడు ముంపుమండలాల్లో నిర్వాసితులకే రూ.27వేలకోట్లు ఖర్చుచేయాల్సి ఉంది.   దాన్ని వదిలేసి నిర్వాసితులకు చేయాల్సిన న్యాయం చేయకుండా, 2021 డిసెంబర్  కి పూర్తిచేస్తామని సిగ్గులేకుండా ఎలాచెబుతారు?

ఏంటి పూర్తిచేసేది తడికె. ల్యాండ్ అక్విజేషన్, రీహాలిబిటేషన్ గురించి పట్టించుకోకుండా, బుర్రపనిచేస్తుందో లేదో తెలియకుండా ఏదేదో మాట్లాడితే ఎవరైనా ఎంతవరకు చెబుతారు? తెలిసీతెలియని మూర్ఖపు ప్రభుత్వం, బుద్ధి,జ్ఞానం లేకుండా మాట్లాడుతోంది. ఈ ఏడాది నవంబర్ లో గేట్లు పెడతామని తొలుత జగన్ ప్రకటించాడు. ఆయన ఇంతవరకు పీపీఏ మినిట్స్ తెప్పించుకొని చదివినట్లు లేరు?

తాడేపల్లి రాజప్రాసాదంలో పడుకుంటే, పోలవరంప్రాజెక్ట్ పనులు జరగవని, అనుకున్నట్లుగా సకాలంలో గేట్లు పెట్టడం కుదరదని ముఖ్యమంత్రి తెలుసుకోవాలి.  పోలవరంప్రాజెక్ట్  నిర్మాణానికి ఇప్పటివరకు ఖర్చుచేసిన రూ.16,673కోట్లలో ల్యాండ్ అక్విజేషన్, ఆర్ అండ్ ఆర్ కే రూ.6,200కోట్లవరకు ఖర్చుచేయడం జరిగింది.  ఇవేవీ తెలుసుకోకుండా, నైతికత అని అంటే ఎలా? లెక్కలు తెలియకపోతే, ఎప్పుడు ఎంతఖర్చు చేశారో తెలియకపోతే తప్పుకుంటే మంచిది. 

అయ్యల విగ్రహాలు పెట్టుకోవడానికికాదు జనం ఓట్లేసింది. జాతిమొత్తం ప్రాజెక్ట్ ఎప్పుడుపూర్తవుతుందా అని ఎదురుచూస్తుంటే, ఆసంగతి పట్టించుకోకుండా నా అయ్య విగ్రహాం పెట్టుకుంటానంటే ఎలా? చంద్రబాబునాయుడు రూ.55,548కోట్లకు ప్రాజెక్ట్ అంచనాలను ఆమోదింపచేస్తే, అది తెలుసుకోకుండా, కేంద్రంతో మాట్లాడేధైర్యం చేయకుండా టీడీపీపై నిందలేస్తారా? 

ఇప్పటివరకు పోలవరం నిర్మాణానికి ఖర్చుచేసిన రూ.16,673కోట్లఖర్చుకుసంబంధించిన కాగితాలను బయటపెట్టండి చూద్దాం. మీసమర్థత ఏమిటో. చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేయకుండానే, కేంద్రాన్ని ఒప్పించి ఏడుముంపు మండలాలను, ఏపీలో కలిపేలా చేశారు. ఆయన ఆనాడు ఆపనిచేయబట్టే, పోలవరంప్రాజెక్ట్ పనులు 72శాతంవరకు జరిగాయి.

మీరు ఇంకా 50వేలఎకరాల వరకు భూసేకరణచేయాల్సి ఉంటే, దాన్నిపట్టించుకోకుండా, విగ్రహాలు పెడతామంటున్నారు.   పోలవరం డ్యామ్ ని తొలుత అనుకున్న విధంగానే 150 అడుగుల ఎత్తులోనే నిర్మించాలి. ఆఎత్తు అయితేనే 194 టీఎంసీలనీటిని నిల్వచేయగలం. అప్పుడే రాష్ట్రంలోని 13జిల్లాలకు గోదావరి జలాలను అందించగలం.  960 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని పూర్తిచేయగలం.

పవర్ ప్రాజెక్ట్ పనులు జాప్యం కావడానికి కారణం రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వమే. ఆనాడు పవర్ ప్రాజెక్ట్ ని తనకొడుక్కి అప్పగించాలని ఆయనచూడబట్టే, ప్రాజెక్ట్ అంచనావ్యయం రూ.2,537కోట్లు పెరిగింది. ఇవన్నీ జగన్  కు తెలియవా? అయ్యా కొడుకుల నిర్వాకం వల్లే ,  పోలవరం ప్రాజెక్ట్ పై రూ.2,537కోట్ల భారంపడింది. 

చంద్రబాబునాయుడు కేంద్రాన్ని ఒప్పించి, ఏపీ జెన్ కో సాయంతో ప్రాజెక్ట్ పనులుచేస్తుంటే, పోలవరం ప్రాజెక్ట్ లోని పవర్ ప్రాజెక్ట్ ని కొట్టేయడంకోసం, పనులు రద్దుచేయించి, రివర్స్ టెండరింగ్ డ్రామాలాడి, రిజర్వ్ టెండరింగ్ చేయడం వల్ల, పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రశ్నార్థకం కావడంవల్ల మరో రూ.7,500కోట్లవరకు నష్టం జరిగింది. తండ్రిహాయాంలో అలా జరిగితే, కొడుకు పాలనలో ఇలా జరిగి, రాష్ట్రం రూ.10వేలకోట్లవరకు నష్టపోయింది.

ఇవేవీ ప్రజలకు తెలియవన్నట్లు విగ్రహాలుపెట్టేసి పాపాలు కడిగేసుకుంటామంటే కుదరదు. జగన్ ఎన్నితప్పుడు కేసులుపెట్టినా, నేను చనిపోయేవరకు ఈ నిజం చెబుతూనే ఉంటాను.  బూతులమంత్రు లతో బూతులు మాట్లాడించకుండా,  జగన్మోహన్ రెడ్డే మీడియా ముందుకొచ్చి వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నా.

పోలవరం త్వరితగతిన పూర్తవ్వడానికి టీడీపీ ఆధ్వర్యంలో రైతులను, రైతుసంఘాలను కలుపుకొని, పోరాటం చేస్తాం. 150 అడుగులు నీటినిల్వ సామర్థ్యంతో, ప్రాజెక్ట్ లో నీటిని నింపినప్పుడే, రాష్ట్ర రైతాంగం, టీడీపీ సంతోషిస్తాయి. 2019 జూలై- ఆగస్ట్ లో స్పిల్ వే మీదుగా గోదావరి జలాలు సముద్రంలోకి వెళ్లాయనే నిజాన్ని జగన్ తెలుసుకుంటే మంచిది.

ఈ అసమర్థ, దద్దమ్మ ప్రభుత్వం ఎప్పటికి పోలవరం పనులు పూర్తిచేస్తుందో ముఖ్యమంత్రే స్వయంగా చెప్పాలి. రాజధానిరైతులు గుండెలుఆగిచనిపోతున్నా, ఒక్క మంత్రి కూడాస్పందించడం లేదు. ప్రభుత్వం ఇప్పటికీ అమరావతి విషయంలో బాధ్యతారాహిత్యంగానే వ్యవహరిస్తోంది. రైతులకు ధాన్యం కొనుగోళ్ల తాలూకా రూ.190కోట్లను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాను.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తుఫానును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధం కావాలి : తూర్పు గోదావరి కలెక్టర్‌