కోవిడ్-19ను కట్టడి చేయడం కోసం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. జాతీయస్థాయి సగటుతో పోలిస్తే ప్రతి మిలియన్ టెస్ట్ లలో అత్యధికంగా పరీక్షలు చేస్తున్న రాష్ట్రాల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో నిలిచింది.
ఈ నేపథ్యంలో దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం మరో సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. అవే మొబైల్ నమూనా సేకరణ కేంద్రాలు. ఒక మొబైల్ వాహనంలో 10 కౌంటర్లు ఉంటాయి. ఒకేసారి 10 మంది వారి వివరాలు నమోదు చేసుకోవడంతోపాటు కోవిడ్-19 పరీక్షల నమూనాలు ఇవ్వవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి మొబైల్ వాహనాలు ఇప్పటికే 20 ఏర్పాటు చేసింది. ఈ మొబైల్ వాహనాలు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఎయిర్ పోర్టులు, రాష్ట్రాల సరిహద్ధు ప్రాంతంలోని చెక్ పోస్టుల దగ్గర ఏర్పాటు చేసి వివిధ రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి వచ్చే వారి నుంచి కోవిడ్ నమూనాలను తీసుకుంటున్నారు.
ఈ మొబైల్ పరీక్షా వాహనాలు ఒకేసారి 10మందికి సంబంధించిన వివరాలు నమోదు చేసుకోవడం, పరీక్ష నమూనాలు సేకరించడం ద్వారా అటు ప్రయాణీకుల సమయం ఆదాకావడంతోపాటు సరిహద్దులోనే ప్రజల నుంచి నమూనాలు సేకరించి కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడం ద్వారా వైరస్ వ్యాప్తి జరగకుండా ఉపయోగపడుతున్నాయి.
అంతే కాకుండా ఈ వాహనాలను కంటైన్మెంట్ జోన్లలో కూడా కోవిడ్ నమూనాలు సేకరించేందుకు వినియోగించవచ్చు. కంటైన్మెంట్ జోన్ లో నివాసం ఉండే ప్రజలు టెస్టు చేయించుకోవడం కోసం బయటకు రావాల్సిన అవసరం లేకుండా.. మొబైల్ వాహనమే వారి ప్రాంతానికి వెళ్లి నమూనాలు సేకరించవచ్చు.
ఈ మొబైల్ వాహనాల ద్వారా సేకరించిన కోవిడ్ నమూనాల ఫలితాలు కూడా అతితక్కువ సమయంలో ఇస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరో 50 మొబైల్ టెస్టింగ్ వెహికిల్స్ ను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. తద్వారా కోవిడ్ వైరస్ వ్యాప్తిని తక్కువ చేయగలమని అంచనా వేస్తోంది.
ఈ మొబైల్ టెస్టింగ్ వాహనం ద్వారా కేవలం పది నిమిషాల్లో ప్రతి కౌంటర్ దగ్గర కోవిడ్ నమూనాలు తీసుకుంటారు. ఆ తర్వాత వారి ఆరోగ్య పరిస్థితి, కోమార్బిడిటీ తదితర లక్షణాల కారణంగా వారిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లకు పంపడమా లేక హోమ్ క్వారంటైన్ లో ఉండాలా? అన్నది నిర్ణయిస్తారు.
ఒకవేళ వారు ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నట్టయితే వారిని ప్రతిరోజూ స్థానికంగా ఉండే ఎఎన్ఎం పర్యవేక్షిస్తూ ఉంటారు.
ఒక్కసారి ప్రయాణీకుడి సమాచారాన్ని మొబైల్ వాహనంలో నమోదు చేసుకున్న వెంటనే అవి స్థానిక ఎఎన్ఎంకి చేరుతాయి. దీనిద్వారా సంబంధిత వ్యక్తిపై పూర్తిస్థాయిలో పర్యవేక్షణకు అవకాశం ఉండండతోపాటు సమర్థవంతమైన నిఘాతోపాటు సమయం వృధా కాకుండా ఉంటుంది.
విజయవాడలో ఈ మొబైల్ టెస్టింగ్ వాహనాల ద్వారా కోవిడ్ నమూనాలు తీసుకునే ప్రాంతాలు:
1. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం
2. గాంధీ మున్సిపల్ హైస్కూల్, వన్ టౌన్
3. కృష్ణలంక
4. విజయవాడ రైల్వే స్టేషన్
5. బసవపున్నయ్య స్టేడియం, అజిత్ సింగ్ నగర్
6. మేరీమాత టెంపుల్, గుణదల
ఉదయం 8 నుంచి 5గంటల వరకు
అపాయింట్మెంట్ కోసం కాల్ చేయాల్సిన నంబర్: 9963112781
ఆన్ లైన్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు: https://covid-andhrapradesh.verahealthcare.com/
ప్రభుత్వం ఎన్ని సదుపాయాలు కలిగి చేసిన కూడా మనం జాగ్రత్తగా లేకుం టే వీధిలో ఉన్న కరోనా ని ఇంట్లోకి ఒంట్లోకి ఆహ్వానించినట్లే!!!