కరోనా వైరస్ ప్రజలకు సోకకుండా, మరింతగా వ్యాపించకుండా ఉండేందుకు వీలుగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. దీంతో ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్లకే పరిమితమవుతున్నారు. అయితే, కొందరు వివిధ రకాల పనులు చేసుకుంటూ ఈ లాక్‌డౌన్ సమయాన్ని గడిపేస్తున్నారు. అలాంటి వారిలో ఓ భార్యాభర్తలు ఈ లాక్‌డౌన్ కాలంలో ఏకంగా బావినే తవ్వేశారు. ఇది మహారాష్ట్రలో జరిగింది. ఇటీవల కేరళకు చెందిన ఓ కుటుంబంలోని 14 మంది ఏకంగా 24 అడుగుల లోతుగల బావిని తమ ఇంటి పెరట్లో తవ్విన విషయం తెల్సిందే. ఇపుడు కేవలం భార్యాభర్త మాత్రమే ఈ బావిని తవ్వి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికిగురిచేశారు.
ఈ వివరాలను పరిశీలిస్తే, మహారాష్ట్రలోని కార్ఖేడ గ్రామానికి చెందిన గజానన్ అనే దంపతులు ఉన్నారు. వీరికి ఓ బిడ్డ కూడా ఉంది. అయితే, వీరు మాత్రం లాక్‌డౌన్ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించారు.
అంతే.. లాక్‌డౌన్ వల్ల దొరికిన ఖాళీ సమయాన్ని ఇంటి ఆవరణలో చేదబావి తవ్వడానికి ఉపయోగించుకుని తాగునీటి కష్టాలు తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా భూమి పూజచేసి బావి తవ్వడం మొదలుపెట్టారు.