వరుసకు సోదరి అయిన యువతి చితిపై దూకి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడుని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్ జిల్లాలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సాగరి జిల్లాలోని బహెరియా పోలీస్ స్టేషన్ పరిధి మఝ్‌గువా గ్రామంలో 21 ఏళ్ల యువతి పొలం నుంచి కూరగాయలు తెచ్చుకునేందుకు గురువారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లింది. అయితే, ఆమె ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుక్కుంటూ పొలంలోకి వెళ్లారు.
అక్కడ పొలం బావిలో పడిపోయి ఉంటుందేమో అన్న అనుమానంతో చూడగా అందులో ఆమె మృతదేహం కనిపించింది. ఈ విషయాన్ని వారు పోలీసులకు తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆమెకు వరుసకు సోదరుడయ్యే కరణ్(18) 430 కి.మీ. దూరంలో ఉండే ధర్ నుంచి మోటారు బైకుపై గ్రామానికి చేరుకున్నాడు.
శుక్రవారం సాయంత్రం సోదరి అంత్యక్రియలు జరుగుతుండగా పట్టరాని దుఃఖంతో ఒక్కసారిగా చితిమంటల్లోకి దూకాడు. దీన్ని గమనించిన బంధువులు అతణ్ని మంటల్లోంచి బయటకు లాగారు. అప్పటికే అతడికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి దారిలోనే చనిపోయాడు.