తమిళనాడు కీలక నిర్ణయం... ఆంధ్రా - కర్నాటకల నుంచి వాహనాలు బంద్

శనివారం, 21 మార్చి 2020 (10:10 IST)
కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ రాష్ట్రాల నుంచి వచ్చే వాహనరాకపోకలను నిలిపివేసింది. ఈ నిర్ణయం ఈ నెల 31వ తేదీ వరకు అమల్లో ఉంటాయి. అయితే నిత్యావసర వస్తువులు, అత్యవసర వైద్య సేవల వాహనాలను మాత్రం అనుమతిస్తారు.
 
కరోనాను కట్టుదిట్టం చేసేందుకు కఠిన చర్యలను తీసుకోవాలన్న ప్రధాని నరేంద్ర మోడీ సూచనల మేరకు తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రులతో మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో తమిళనాడు సీఎం పళనిస్వామి, ఆరోగ్యశాఖ కార్యదర్శి బీలా రాజేశ్ పాల్గొన్నారు. 
 
ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సరిహద్దులను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. అయితే, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేసే వారి కోసం అతి తక్కువ సంఖ్యలో బస్సులను నడుపుతామని తెలిపింది. దేశ, రాష్ట్ర సంక్షేమం కోసం తాము తీసుకున్న నిర్ణయానికి ప్రజలంతా సహకరించాలని ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి విజ్ఞప్తి చేశారు. 
 
రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ 
మరోవైపు, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖలు రాసింది. ఈ విపత్తును అధిగమించేందుకు ప్రజలు సహకరించాలని కోరుతూ పలు సూచనలు చేసింది.  
 
* 'కరోనా'పై ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహించాలి.
* ప్రభుత్వ ఉద్యోగుల పనివేళలు రెగ్యులేట్ చేయాలి.
* ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా ఉంచాలి. 
* జనసమ్మర్థం తగ్గించేందుకు చర్యలు చేపట్టాలి. 
* ప్రైవేట్  సంస్థలు తమ ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోమ్' ప్రాధాన్యత ఇవ్వాలి. 
* రైళ్లు, బస్సుల్లో ప్రయాణికులు దూరం దూరంగా కూర్చోవాలంటూ తదితర సూచనలు చేసింది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం కువైట్‌కు కరోనా భయం.. విదేశీయుల దేశ బహిష్కరణ .. అత్యధికులు తెలుగువారే