యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి.. ఇప్పటివరకు అరకోటి మందిని పొట్టనబెట్టుకుంది. రాయిటర్స్ వార్తా సంస్థ విశ్లేషించిన గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మరణాల సంఖ్య 50లక్షలు దాటింది. కరోనా వెలుగు చూసిన తొలి ఏడాదిలో 25లక్షల మందిని వైరస్ బలితీసుకోగా.. మరో 25లక్షల మరణాలు కేవలం 236 రోజుల్లోనే సంభవించాయి. చాలా దేశాల్లో వ్యాప్తి చెందిన డెల్టా వేరియంటే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా నమోదైన కరోనా మరణాల్లో సగానికి పైగా కేవలం ఐదు దేశాల్లోనే నమోదయ్యాయి. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక మరణాలు చోటుచేసుకోగా.. ఆ తర్వాత రష్యా, బ్రెజిల్, మెక్సికో, భారత్ దేశాల్లోనూ లక్షల మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో అయితే ఈ సంఖ్య ఏకంగా 7లక్షలు దాటడం గమనార్హం. అగ్రరాజ్యంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ మరణాలు మాత్రం ఇంకా అత్యధిక స్థాయిలోనే ఉంటున్నాయి. ఇప్పటివరకు 7లక్షల మందికి పైగా మరణించారు. అక్కడ సగటున రోజుకు 1900 మంది కరోనాతో చనిపోతున్నారు.