Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ రోజు 'ప్రపంచ వృద్ధుల దినోత్సవం'

ఈ రోజు 'ప్రపంచ వృద్ధుల దినోత్సవం'
, శుక్రవారం, 1 అక్టోబరు 2021 (22:35 IST)
యౌవనదశలో తమ శక్తియుక్తులన్నింటినీ పిల్లల ఎదుగుదలకే వెచ్చించే అమ్మానాన్నలు- అవసాన దశలో బుక్కెడు బువ్వకు, జానెడు నీడకు తడుముకోవాల్సిన దీనస్థితిలో చిక్కుకుపోవడం బాధాకరం. 
 
కొమ్మకు పూసిన పూలు వాడక మానవు, చెట్టు కాసినకాయలు పళ్లయిఫలక మానవు. అలాగే పుట్టిన మనిషికి వృద్ధాప్యం రాక మానదు.

ఇదంతా సృష్టి ధర్మం. పుట్టుక, పసితనం, యవ్వనం, పెళ్లి, పిల్లలు, వృద్ధాప్యం, మరణం ఇదే జీవిత చక్రం. జీవనసత్యం, పిల్లల్నికని, కంటికి రెప్పగా, ఊపిరిలో ఊపిరిగా చూసుకుంటూ పెంచి వాళ్లు ప్రయోజకులవ్వాలని రక్తమాంసాలు, ఆస్తిపాస్తులు కర్పూరంలా కరిగినా లెక్కచేయక, బిడ్డల కోసమే ముసురుతున్న వృద్ధాప్యపు ఛాయల్ని కనిపెట్టని తల్లిదండ్రులు ఈ రోజుల్లో ఎందరో ఉన్నారు.
 
 ప్రపంచ వృద్ధుల దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న నిర్వహించబడుతుంది. పెద్దల పట్ల నేటితరం చూపిస్తున్న వ్యవహారశైలిని పరిగణనలోకి తీసుకొని అంతర్జాతీయ స్థాయిలో ఈ సమస్యను చర్చించి వృద్ధుల దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించారు.

మొట్టమొదటిసారిగా వియన్నాలో 1984లో వయో వృద్ధుల గురించి అంతర్జాతీయ సదస్సు నిర్వహించబడింది. సీనియర్‌ సిటిజన్‌ అనే పదం కూడా ఇదే సదస్సులో మొదటిసారిగా వాడడం జరిగింది.మొదటిసారిగా 1991, అక్టోబర్‌ 1న ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు.
 
1950లో మనిషి  సగటు ఆయుర్దాయం 46 సంవత్సరాలు, అది- 2010లో 68 ఏళ్లకు పెరిగింది. రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రపంచంలో 2019లో 65 ఏళ్లు దాటినవారి సంఖ్య 70.3 కోట్లు. అది 2050 నాటికి 150కోట్లకు చేరుకునే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. వైద్య ఆరోగ్య రంగంలో సాంకేతికత అభివృద్ధి, ఆరోగ్య పరిరక్షణపై సమాజంలో పెరిగిన అవగాహన మనుషుల ఆయుర్దాయాన్ని పెంచింది.
 
వృద్ధాప్యం మరో పసితనం లాంటిది. చిన్న పలకరింపును కోరుకునే వయసు వారిది. ఆత్మీయుల ఎంతగానో ఎదురుచూపులు చూసే మనసు వారిది. ఈరోజుల్లో ఏకాకుల్లా వృద్ధాశ్రమాల్లో చేరుతున్నారు.

ప్రేమ, ఆత్మీయత ల్లేని సంసారాల వల్ల, ఉద్యోగాల పేరిట దూరమైపోయిన కోడుకు- కోడళ్ల వల్ల గృహసంబంధమైన వివాదాల వల్ల దూరంగా ఉంటున్నారు. కారణమేదైనా ఫలితం మాత్రం పండుటాకులైన తల్లిదండ్రుల మీద పడుతోంది.అమ్మా అన్న పిలుపుకోసం ‘నాన్నా’ అన్న పలకరింపు కోసం గుండెల్ని అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు.
 
వివిధ రంగాల్లో అపార అనుభవంతో కూడిన వారి మేధాజ్ఞానాన్ని ఉపయోగించుకొంటూ, భవిష్యత్‌ తరాలకూ అందించాల్సిన అవసరం ఉంది

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆరోగ్యానికి శాఖాహారం చాలా ఉత్తమం