Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశ్వవిద్యాలయాలు, పరిశ్రమల మధ్య సమన్వయం అవసరం: ఉపరాష్ట్రపతి

Advertiesment
విశ్వవిద్యాలయాలు, పరిశ్రమల మధ్య సమన్వయం అవసరం: ఉపరాష్ట్రపతి
, బుధవారం, 9 డిశెంబరు 2020 (07:43 IST)
2020 నూతన ఆవిష్కరణ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల ఔత్సాహిక పారిశ్రామిక సామర్థ్యాన్ని పెంపొందించడం చాలా క్లిష్టమైన అంశమని, ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయాలు, పారిశ్రామిక రంగం సమన్వయంతో కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.

వినూత్న ఆలోచనలతో ముందుకు వస్తున్న ఔత్సాహిక పారిశ్రామిక ప్రతిభావంతులను ప్రోత్సహించడంతో పాటు, మార్గదర్శనం చేయాలని సూచించారు. 

ఈరోజు విశాఖపట్నం నుంచి అంతర్జాల మాధ్యమం ద్వారా టి.ఐ.ఈ. గ్లోబల్ సమ్మిట్ -2020 ని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. యువతలో ఔత్సాహిక పారిశ్రామిక సామర్థ్యాన్ని, ప్రతిభను ప్రోత్సహించేందుకు, పెంపొందించేందుకు ఇంకుబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని విశ్వవిద్యాలయాలకు సూచించిన ఆయన, ఆయా విశ్వవిద్యాలయాల ప్రాంగణాల్లో ఔత్సాహిక పారిశ్రామిక సామర్థ్యాన్ని ప్రోత్సహించేందుకు నిధులు సమకూర్చాలని కార్పొరేట్ రంగానికి సూచించారు.

ద ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (టి.ఐ.ఈ)  సంస్థ సిలికాన్ వ్యాలీ ఆధారిత లాభాపేక్ష లేని సంస్థ. ఇది నెట్‌వర్కింగ్ ద్వారా అంకుర సంస్థలకు (స్టార్టప్స్) సహకారం అందిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న అంతర్జాతీయ సమ్మేళనం – 2020 ద్వారా భారతదేశంలోకి పెట్టుబడులకు ప్రోత్సాహాన్ని అందిస్తోంది.

భారతదేశ జనాభాలో 65 శాతం మంది యువత ఉన్నారని పేర్కొన్న ఉపరాష్ట్రపతి, ప్రతిభావంతులైన యువత శక్తి సామర్థ్యాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవాలని సూచించారు. ఉద్యోగార్థులుగా గాక, ఉద్యోగాల సృష్టికర్తలుగా యువత ఆలోచనల్లో మార్పు రావాలని ఆకాంక్షించిన ఆయన, మహిళల ఔత్సాహిక పారిశ్రామిక సామర్థ్య ప్రోత్సాహం కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మెంటరింగ్ ద్వారా 50వేల మంది ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను టి.ఐ.ఈ. ప్రోత్సహించడం సంతోషకరమన్నారు.

ప్రపంచంలో మూడవ అతిపెద్ద అంకుర సంస్థల నిలయంగా భారతదేశాన్ని అభివర్ణించిన ఉపరాష్ట్రపతి, ఇటీవలి నాస్కామ్ (ఎన్.ఏ.ఎస్.ఎస్.సీ.ఓ.ఎమ్) నివేదికను ఉటంకించారు. టెక్ స్టార్టప్ లలో 50శాతం మంది కరోనాకు ముందు ఉన్న పరిస్థితుల దిశగా త్వరలోనే పుంజుకుంటారన్న నివేదికలోని అంశాలు ఆనందదాయకమన్న ఆయన, భవిష్యత్తులో కచ్చితంగా అన్ని భారతీయ అంకుర సంస్థలు మంచి విజయాలు, ఆర్థిక వృద్ధిని నమోదు చేస్తాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా వివిధ అధ్యయనాలను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, ప్రపంచంలోని చాలా ఔత్సాహిక పారిశ్రామిక దేశాలు సుసంపన్నంగా ఉన్నాయని.. తద్వారా ఔత్సాహిక పారిశ్రామిక ప్రోత్సాహంతోపాటు ప్రజలకు సౌకర్యం, ఆనందం లభిస్తుందన్నారు.

ఔత్సాహిక పారిశ్రామిక సామర్థ్యాన్ని ప్రోత్సహించడం లాభాల కోసమే కాదన్న ఉపరాష్ట్రపతి, విద్య, ఆరోగ్య సంరక్షణ, కనీస సౌకర్యాల కల్పన ద్వారా ప్రజల జీవన విధానాన్ని మెరుగు పరిచేందుకు కూడా ఇది మరింత కీలకమైనదని తెలిపారు. ఇందులో పోటీ మాత్రమే కాకుండా, ప్రజల ప్రయోజనాలు దాగి ఉన్నాయన్నారు.
 
కరోనా విసిరిన సవాళ్ల గురించి ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, ప్రస్తుత కాలాన్ని ప్రతికూల పరిస్థితులను అవకాశాలు ఒడిసిపట్టే సమయంగా అభివర్ణించారు. నానాటికీ పెరుగుతున్న నూతన సవాళ్ళను ఎదుర్కునేందుకు వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని పిలుపునిచ్చిన ఆయన, అలాంటి ఆలోచనల ద్వారా ముందుకు వచ్చే ఔత్సాహిక, ఆశాజనక అంకుర సంస్థలకు అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. 
 
ఆర్థిక వృద్ధి మరియు ఉపాధి కల్పనలో వ్యవస్థాపకత కీలక పాత్ర పోషిస్తుందన్న ఉపరాష్ట్రపతి, ‘స్టార్టప్ ఇండియా’ ద్వారా అంకుర సంస్థలకు సానుకూల వాతావరణాన్ని కల్పించిన భారత ప్రభుత్వాన్ని అభినందించారు.

ఔత్సాహిక పారిశ్రామిక సామర్థ్యాన్ని ప్రోత్సహిచడం అంటే సరైన ఆర్థిక విధానాన్ని రూపొందించడం, ఉత్తమ విద్యా పాఠ్యప్రణాళికను అభివృద్ధి చేయడం మాత్రమే కాదని.. దీనిద్వారా ఆవిష్కరణలు, ఆలోచనలు ఏకకాలంలో వృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల విజయాలు సృష్టించే ఆర్థిక అవకాశాలు భారతదేశం కోసం మాత్రమే గాక యావత్ ప్రపంచానికి ఉపయోగపడతాయన్నారు.
 
2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా సుమారు 5కోట్ల కొత్త ఉద్యోగాలు అవసరమవుతాయన్న ఉపరాష్ట్రపతి, అభివృద్ధి సాధించిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు.. తర్వాతి తరాలకు మార్గదర్శనం చేయాల్సిన బాధ్యత ఉందని టి.ఐ.ఈ. వంటి సంఘాలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మొదలైన సంస్థలకు పిలుపునిచ్చారు.

వారి అనుభవాలను, విజ్ఞానాన్ని భవిష్యత్ తరాలతో పంచుకోవాలని, అదే విధంగా విశ్వవిద్యాలయాలు సైతం విద్య పూర్తయ్యే సమయానికే విద్యార్థుల్లో పారిశ్రామిక సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా పరిశోధనలు, ఇంటర్న్‌షిప్‌ల వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. 

ప్రతిభావంతుల నుంచి చక్కటి ఔత్సాహిక పారిశ్రామిక ఆలోచనలు పెట్టుబడిదారులను ఆకర్షిస్తాయని అభిప్రాయపడిన ఉపరాష్ట్రపతి, వారు సిలికాన్‌వ్యాలీ లాంటి చోట్ల మాత్రమే కాకుండా హైదరాబాద్, విశాఖపట్నం వంటి ప్రతిభావంతులున్న ఇతర ప్రదేశాల్లో కూడా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామిక రంగం సానుకూల మార్గంలో ముందుకు సాగేందుకు ప్రైవేటు రంగం, ప్రభుత్వేతర సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వాలతో కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.

వ్యాపారాన్ని ఆరంభించడం చాలా క్లిష్టమైన పనిగా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అనుభవం ఉన్న మార్గదర్శకుల సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ టి.ఐ.ఈ. కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక యువ పారిశ్రామిక వేత్తలకు దిశా నిర్దేశం చేసేందుకు 300 మందికి పైగా మెంటర్స్ అందుబాటులో ఉండడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. 

ఇటువంటి ఉన్నత కార్యక్రమాలు ఆలోచనలు, విజ్ఞానాన్ని పరస్పరం పంచుకునేందుకు ఒక మంచి వేదికను అందించడమే గాక, వివిధ ఆలోచనల మధ్య చక్కని వంతెన నిర్మించడంలో సహాయపడతాయన్న ఉపరాష్ట్రపతి, ఇందుకోసం చొరవ తీసుకున్న టి.ఐ.ఈ.ని అభినందించారు.

ఈ కార్యక్రమంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ  కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, టీఐఈ గ్లోబల్ అధ్యక్షుడు  మహవీర్ శర్మ, టీఐఈ హైదరాబాద్ విభాగం బాధ్యుడు, కంట్రోల్ ఎస్ సంస్థ వ్యవస్థాపకుడు పిన్నపురెడ్డి శ్రీధర్ రెడ్డి, భారతదేశంతోపాటు వివిధ దేశాల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, పెట్టుబడి దారులు, వివిధ రంగాల ప్రముఖులు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్త జిల్లాల ప్రకటన వచ్చిన 2 వారాల్లోగానే విభజన!