Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నగరాల్లో సైక్లింగ్ కోసం ప్రత్యేక ట్రాక్‌ లు: ఉపరాష్ట్రపతి

Advertiesment
నగరాల్లో సైక్లింగ్ కోసం ప్రత్యేక ట్రాక్‌ లు: ఉపరాష్ట్రపతి
, ఆదివారం, 29 నవంబరు 2020 (18:54 IST)
సైక్లింగ్ సంస్కృతిని ప్రోత్సహించడంతోపాటు నగరాలు, పట్టణాల్లో సైక్లింగ్ కోసం ప్రత్యేకమైన ట్రాక్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. తక్కువ ఖర్చుకే, కాలుష్యరహిత ప్రయాణంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సైక్లింగ్ ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని ఆయన తెలిపారు.
 
‘కరోనానంతర ప్రపంచంలో సైక్లింగ్ పాత్ర' అంశంపై ఏర్పాటుచేసిన అంతర్జాతీయ అంతర్జాల వేదికనుద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. పర్యావరణ హిత రవాణా వ్యవస్థను విస్తారంగా వినియోగించేలా భారీ ప్రజా చైతన్యం తీసుకురావాలని.. ఇందుకుగానూ తరచుగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్న ఆయన.. ఈ అంతర్జాతీయ వెబినార్‌ను సరైన సమయంలో నిర్వహిస్తున్నారని అభినందించారు.

భూమండలాన్ని పర్యావరణహితంగా, పచ్చగా, భద్రంగా, క్షేమంగా ఉంచేందుకు అన్నిదేశాలు సంయుక్త కార్యాచరణతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా మన జీవితాల్లో, మనం ఏం కొనాలి, ఏం వాడాలి, మన సమయం, మన రవాణా ఇలా ప్రతి అంశంలోనూ మార్పులు వచ్చాయన్న ఉపరాష్ట్రపతి.. ఆంక్షల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వాహనాల వాడకంలో తగ్గుదల కనబడుతోందని.. నడకతోపాటు సైకిళ్ల వినియోగం పెరిగిందని గుర్తుచేశారు.
 
జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా మన జీవితాల్లో పెరుగుతున్న ముప్పును తగ్గించుకునేందుకు సైక్లింగ్ ఉత్తమమైన మార్గమన్న ఉపరాష్ట్రపతి, ఇంధన వనరులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గడంతోపాటు కాలుష్యాన్ని తగ్గించడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వంటి ఎన్నో లాభాలుంటాయని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. వీటితో పాటు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు కనీస అవసరాలకు సైకిళ్లనే ఎక్కువగా వినియోగిస్తారన్నారు. 

మరోసారి మనం సైకిళ్లవైపు దృష్టిసారించేందుకు కరోనా అవకాశం కల్పించిందని, అందుకోసం.. మళ్లీ సైక్లింగ్‌ను విరివిగా వినియోగించేందుకు పట్టణ, నగర పరిపాలన సంస్థల విధాననిర్ణేతలు ప్రత్యేక చొరవతీసుకోవాలని, సైక్లింగ్ ట్రాక్‌లను నిర్మించడం ద్వారా ప్రజలను సైక్లింగ్ వైపు ప్రోత్సహించాలని సూచించారు.

‘యూరప్, చైనా, అమెరికా వంటి దేశాల్లో పట్టణ సైక్లింగ్ నెట్‌వర్క్‌ల కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారతదేశంలోనూ సైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు విస్తృత అవకాశాలున్నాయి. ఇందుకు అనుగుణంగా మౌలికవసతుల కల్పనను పెంచాల్సిన అవసరం ఉంది’ అని ఉపరాష్ట్రపతి సూచించారు.

సైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు ఇది సరైన తరుణమన్న ఆయన.. శబ్దకాలుష్యాన్ని తగ్గించడంతోపాటు రహదారి భద్రతను ప్రోత్సహించడం, ఇంధన దిగుమతి ఖర్చులను తగ్గించుకునేందుకు వీలవుతుందన్నారు. భారతదేశంలో స్వల్పదూరాలకు ద్విచక్ర వాహనాలు, కార్ల వినియోగానికి బదులు సైకిళ్లను వినియోగిస్తే ఏడాదికి రూ.24.3 బిలియన్ డాలర్ల (దాదాపుగా లక్షా 79వేల కోట్ల రూపాయలు) ఆదా చేయవచ్చన్న తాజా నివేదికలను కూడా ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా ఉటంకించారు.

సైక్లింగ్‌కు అనువైన వాతావరణాన్ని, ఏర్పాట్లను కల్పించలేని కారణంగా సమాజంలోని అన్ని వర్గాలకు సైక్లింగ్ దూరమవుతూ వస్తోందన్న ఆయన, కరోనానంతర ప్రపంచం పచ్చగా, ఆరోగ్యంగా  ఉండాలంటే నగరాలు, పట్టణాల్లో పర్యావరణాన్ని కాపాడుకునేందుకు కాలుష్యంలేని సమాజం కోసం సైక్లింగ్ ట్రాక్‌లను నిర్మించాలన్నారు.

ఇందుకు అనుగుణంగా పథకాలు, విధానాల్లో మార్పులు తీసుకురావాలన్నారు. పబ్లిక్ బైక్ షేరింగ్ వ్యవస్థను, కార్బన్ క్రెడిట్ వ్యవస్థను సృష్టించడం ద్వారా సైక్లిస్టులకు లబ్ధిచేకూర్చడం, ఈ-బైస్కిల్ లను ప్రోత్సహించాలని సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇకపై టాక్సీలుగా ద్విచక్రవాహనాలు!