సామాజిక మాధ్యమాల ప్రభావం పెరిగిన నేపథ్యంలో.. హంస ఎలాగైతే.. నీటిని, పాలను వేరు చేయగలదో.. అలాగే విద్యార్థుల్లో చిన్నతనం నుంచే మంచి, చెడులను బేరీజు వేసుకునే సామర్థ్యాన్ని పెంపొందింపజేయాలని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. సోమవారం ఉపరాష్ట్రపతి భవన్ నుంచి ఆన్‌లైన్లో టైమ్స్ ఆఫ్ ఇండియా సంస్థ నిర్వహించిన ‘టైమ్స్ స్కాలర్స్ ఈవెంట్’ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
వాస్తవాలను తెలుసుకుని దాన్ని అలవర్చుకోవడం, అసత్యాలను గుర్తించి వాటికి దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల్లో పఠనాసక్తి తగ్గిపోతుండటంపై ఉపరాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. పుసక్త పఠనం, వార్తాపత్రికల పఠనాన్ని దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవాలని విద్యార్థులు, యువతకు సూచించారు. అపరిమిత సమాచారం అరచేతిలోనే అందుబాటులో ఉన్న ఈ పరిస్థితుల్లో జాగరూకతతో వ్యవహరించడంతోపాటు నిరంతర అధ్యయనం చేయడం, పుస్తకాలు చదవడంపై విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఉపరాష్ట్రపతి నొక్కిచెప్పారు.
‘కలలు కనండి. వాటి సాకారానికి మహమ్మారి నేపథ్యంలో వ్యాధినిరోధకతను పెంచుకోవడంతోపాటు ఏకాగ్రత, క్రమశిక్షణ పెంచుకునేందుకు యోగాసాధన ఉపయుక్తంగా ఉంటుందన్నారు.
నేటి ప్రపంచంలో ప్రతి రంగంలో తీవ్రమైన పోటీ నెలకొందని.. దీన్ని అధిగమించేందుకు తమ తమ రంగాల్లో నైపుణ్యాన్ని పెంచుకోవడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. ‘విజయం సాధించేందుకు అడ్డదార్లు ఉండవు. దయచేసి ఈ విషయాన్ని అందరూ మదిలో ఉంచుకోవాలి’ అని ఉపరాష్ట్రపతి సూచించారు.