Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

8 ఏళ్ల లోపు పిల్లలకు మొబైల్ ఫోన్ వినియోగం హానికరం

webdunia
బుధవారం, 29 జులై 2020 (21:05 IST)
కనీస వయస్సు ఎనిదేళ్లు దాటిన పిల్లలకే మొబైల్ ఫోన్లను వినియోగించేందుకై ఇవ్వాలని ఐ.టీ, కమ్యూనికేషన్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవలి కాలంలో రెండేళ్లు కూడా నిండని వారికి కూడా సెల్ ఫోన్లు ఇచ్చి వారిని ఫోన్ వ్యసనపరులుగా చేస్తున్నారని, దీని ద్వారా వారి మానసిక, శారీరక ఆరోగ్య పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని హెచ్చరించారు.
 
తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నెలరోజుల పాటు నిర్వహిస్తున్న సైబ్- హర్ కార్యక్రమంలో భాగంగా "సాంకేతికతకు నేటితరం పిల్లలు వ్యసనపరులవుతున్నారా" అనే అంశంపై బుధవారం సాయంత్రం రాష్ట్రంలోని మహిళలు, యువతకు వెబ్ ఆధారిత చైతన్య సదస్సు నిర్వహించారు. సింబయాసిస్ లా స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ల సహకారంతో నిర్వహించిన ఈ సదస్సులో భారతీయ సైనిక దళాలకు మీడియా శిక్షకురాలుగా ఉన్న జూహీ కౌల్  ప్రధాన వక్తగా ప్రసంగించారు.
 
కోవిడ్ నేపథ్యంలోవిధించిన లాక్‌డౌన్ తదనంతర పరిస్థితుల్లో వచ్చిన మార్పులవల్ల ఆన్లైన్ క్లాసులు అనివార్యమయ్యాయని అన్నారు. అయితే, కనీసం ఎనిమిదేళ్ల పైన వయస్సు ఉన్నపిల్లలకు మాత్రమే ఈ క్లాసులు వర్తింప చేయాలని ఆమె సూచించారు. పదేళ్ల లోపు పిల్లలకు రోజూ కనీసం ఒక గంటకన్నా ఎక్కువసేపు ఈ ఆన్లైన్ క్లాసులు ఉండొద్దని, ఈ వయస్సులో పిల్లలకు వివిధ అంశాలపై సహజంగా ఉండే ఆసక్తి, నిశిత పరిశీలన, ఇమాజినేషన్లకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు.
 
ఇటీవలి కాలంలో పిల్లలు ముఖ్యంగా యువత ఇంటర్నెట్, సోషల్ మీడియాకు బానిసలుగా మారి అర్థ రాత్రివరకూ మొబైల్ ఫోన్లను ఉపయోగించడం అధికమైందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల జ్ఞాపకశక్తి తగ్గడం, చిరాకు, అసహనం అధికం కావడం, శారీరక శ్రమకు దూరం కావడంతో పలు రకాల సమస్యలను ఎదుర్కుంటున్నారని వివరించారు. పిల్లలు, యువకులు రోజుకు కనీసం ఎనిమిది గంటలపాటు నిద్రపోయేవిధంగా పేరెంట్స్ తగు చర్యలు చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు.
 
ప్రస్తుత అనివార్య పరిస్థితుల్లో ఇంటర్నెట్ ఆధారిత మొబైల్ ఫోన్, టాబ్, లాప్ టాప్‌ల ఉపయోగాన్ని పరిమిత సమయంలోనే వినియోగించేలా చూడాలని సూచించారు. సోషల్ మీడియాపై మన నియంత్రణ ఉండాలి కానీ అవే మనను నియంత్రించే స్థాయికి తేవద్దని జూహీ కౌల్ హెచ్చరించారు. టాబ్, మొబైల్, లాప్ టాప్‌లలో అనవసరం, ఎప్పుడూ ఉపయోగించని యాప్‌లను డిలీట్ చేయాలని అన్నారు. ఎవరైనా రోజుకు నాలుగు గంటలకన్నా అధికంగా ఇంటర్నెట్ ఉపయోగిస్తే అది వ్యసనం కిందకి వస్తుందని తెలిపారు.
 
అనవసర యాప్‌లను తొలగించడంతో పాటు కేవలం విద్యాపరమైన అవసరాలకే ఇంటర్నెట్ ఉపయోగించడం, అధికంగా  ఉపయోగిస్తే కలిగే అనర్థాలను పిల్లలకు అర్థమయ్యేట్టు చెప్పడం చేయాలని అన్నారు. ప్రతిరోజూ ఇంట్లోనే యోగా, సంగీత సాధన, వ్యాయామం చేయడం లాంటివి చేయించాలని ఆమె తెలియచేశారు. ఈ కార్యక్రమంలో సి.ఐ.డీ. విభాగానికి చెందిన రవి కుమార్ రెడ్డి, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ బాలి, నీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణతో పాటు ఢిల్లీ తదితర రాష్ట్రాలకు చెందిన దాదాపు మూడువేలమంది విద్యార్థులు, పేరెంట్స్ పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? ఇలాంటి స్నాక్స్ తీసుకోవాలి..