కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కామనుకుంటే.. అంతలో మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. దేశంలో కొన్ని రోజులుగా హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తి అధికమవుతోంది. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురికిపైగా ఈ వైరస్ సోకింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్ సబ్ వేరియంట్ అని కేంద్రం తెలిపింది. పిల్లలు, అనారోగ్యాలతో బాధపడుతున్న వృద్ధులను ఈ వైరస్ సులభంగా సోకుతుందని కేంద్రం వెల్లడించింది. ఈ వైరస్ భారత్‌కు కొత్త కాదని.. దేశంలో ప్రతి సంవత్సరం రెండు పర్యాయాలు ఇది వ్యాపిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
కొన్నిసార్లు వైరస్ వ్యాప్తి వేగం అధికంగా ఉన్నప్పటికీ, మార్చి చివరి కల్లా హెచ్3ఎన్2 కేసులు తగ్గిపోయే అవకాశాలు వున్నాయని.. దీనిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.