హిందూ ఉగ్రవాదం కామెంట్స్.. కమల్ హాసన్‌పై కేసులు... అరెస్టు ఖాయమా?
ఈనెల ఏడో తేదీన తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోనున్న విశ్వనటుడు కమల్ హాసన్ చిక్కుల్లో పడ్డారు. హిందూ ఉగ్రవాదంపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా ఈ తమిళ నటుడిపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఐదు సెక్షన్ల కిం
ఈనెల ఏడో తేదీన తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోనున్న విశ్వనటుడు కమల్ హాసన్ చిక్కుల్లో పడ్డారు. హిందూ ఉగ్రవాదంపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా ఈ తమిళ నటుడిపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఐదు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నింటిపై శనివారం విచారణ జరుగనుంది.
ఒక మతాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు సెక్షన్ 500 కింద కేసు నమోదు చేశారు. అలాగే 511 సెక్షన్ కింద నేరాలకు పూనుకోవడం, సెక్షన్ 298 కింద పరుష వ్యాఖ్యలతో మతపరమైన భావాలు దెబ్బతినేలా వ్యవహరించడం, సెక్షన్ 295(ఏ) కింద మత విశ్వాసాలను కించపరచడం, మత భావాలను దెబ్బతీయడం, సెక్షన్ 505(సీ) కింద ఒక వర్గంపైన, మతంపైన దాడులు చేసేలా మాట్లాడడం వంటి అభియోగాలపై కమల్ హాసన్ కేసుల్లో ఇరుక్కున్నాడు. ఈ కేసులన్నింటిపై శనివారం విచారణ జరుగనుంది.
కాగా, 'హిందూ ఉగ్రవాదం' అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీనటుడు కమల్ హాసన్‌పై దేశంలోని పలువురు మండిపడుతోన్న విషయం తెలిసిందే. రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం ఉంటే మంచి పనులు చేసి రావాలని, ఇటువంటి వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలవాలని చూడకూడదని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే, ఈ కేసులన్నీ కూడా బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే నమోదు కావడం గమనార్హం.