కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో జరిగిన సామూహిక హత్యలు, అంత్యక్రియల వివాదం ఇప్పుడు మరింత సంచలనంగా మారింది. ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఓ మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.
1995 నుండి 2014 మధ్య కాలంలో వందలాది మృతదేహాలను ఖననం చేయాలని ఆలయ పెద్దలు ఆదేశించారని, దీనిపై నోరు విప్పితే తనను, తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారని తెలిపారు. రెండు దశాబ్దాలకు పైగా ధర్మస్థలలో తాను చేసిన భయంకరమైన పనులను వివరిస్తూ, ఈ సామూహిక అంత్యక్రియల వెనుక ఆలయ నిర్వహణ పెద్ద పెద్ద వ్యక్తుల ప్రమేయం ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఈ మృతదేహాల్లో ఎక్కువ మంది మహిళలు, మైనర్ బాలికలేనని, వారిపై లైంగిక దాడులు, హత్యలు జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని అతను పోలీసులకు తెలిపాడు. ఈ మృతదేహాలను నేత్రావతి నది తీరంలో, సమీపంలోని అటవీ ప్రాంతాల్లో ఖననం చేసినట్లు వెల్లడించాడు.
ఈ ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. సిట్ బృందం విజిల్ బ్లోయర్ చూపించిన ప్రదేశాలలో తవ్వకాలు జరిపి, ఇప్పటికే కొన్ని మానవ అవశేషాలు, ఎముకలను కనుగొంది.