Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇండిపెండెన్స్ డే సెలెబ్రేషన్స్ - సరిహద్దుల్లో రోబోటిక్ గ్రిడ్స్

Advertiesment
robotic grid security

ఠాగూర్

, గురువారం, 14 ఆగస్టు 2025 (19:50 IST)
దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శుక్రవారం దేశ వ్యాప్తంగా జరుగనున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేశారు. ముఖ్యంగా, దేశ సరిహద్దుల్లో అత్యాధునిక భద్రతా వ్యవస్థను మొహరించింది. మూడు అంచెల్లో పనిచేసే రోబోటిక్ గ్రిడ్‌ను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. కుప్వారా జిల్లాలోని తాంగర్ గ్రామం వద్ద దీనిని ఏర్పాటు చేశారు. పాక్ వైపు నుంచి ఒక్కరు కూడా సరిహద్దు దాటకుండా చూడాలని దళాలను ఉన్నతాధికారులు ఆదేశించారు. 
 
ఈ గ్రిడ్ తొలి అంచెలో ప్రత్యేకమైన రాడార్లు, థర్మల్ ఇమేజింగ్ వ్యవస్థలు, మానవ రహిత విమానాలు ఉంటాయి. ఇవి భూమిపై కదలికలను గుర్తించేందుకు నిరంతరం పనిచేస్తుంటాయి. రెండో అంచెలో ప్రత్యేకమైన మందుపాతరలతో కూడిన బ్యారియర్ వ్యవస్థలను ఏర్పాటుచేశారు. దీంతోపాటు ప్రత్యేకమైన ఆప్టికల్ వ్యవస్థను కూడా మోహరించినట్లు తెలిసింది. ఇక చివరి దశలో బలగాల గస్తీలు వంటివి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
 
ఇటీవల సుందర్బనీలో భారత సైన్యం తమ సంసిద్ధతను ఇటీవల మీడియాకు చూపించింది. అత్యాధునిక వ్యవస్థలను అనుసంధానించి సరిహద్దు భద్రతను బలోపేతం చేస్తున్నామని పేర్కొంది. ఈ క్రమంలో భాగంగా స్మార్ట్ ఫెన్స్ వ్యవస్థ, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, ఆల్ టెన్ వాహనాలు, నైట్ విజన్ పరికరాలను ప్రదర్శించింది. కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఉపకరణాలను పాకిస్థాన్‌పై మే 7 నుంచి 10 వరకు చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం విస్తృతంగా పరీక్షించి, విజయవంతంగా వినియోగించింది. ఈ విషయాన్ని కూడా అధికారులు మీడియాకు వెల్లడించారు.
 
ఇజ్రాయెల్ మాదిరిగా పాకిస్థాన్, బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల్లో భారత్ కంచెలను నిర్మిస్తోంది. ఈ మూడు దేశాల సరిహద్దుల్లో వేలకుపైగా కిలోమీటర్ల పొడవునా నిర్మాణం పూర్తయింది. ఆ కంచెలకు సీసీటీవీ కెమెరాలు, టెలిస్కోపులు, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ల వంటి హైటెక్ సాధనాలను అమర్చారు. అయితే, భారత్-పాక్ సరిహద్దులో ఉగ్రవాదులు, దొంగ రవాణాదారులు కంచె కింద సొరంగాలు తవ్వి భారత భూభాగంలోకి చొరబడుతున్నారు. డ్రోన్ల ద్వారా ఆయుధాలు, మాదకద్రవ్యాలను పంపుతున్నారు. గత కొన్నేళ్లలో భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జమ్మూలో పలు సొరంగాలను గుర్తించింది. వాటిని గుర్తించడానికి రాడార్లు అమర్చిన డ్రోన్లను బీఎస్ఎఫ్ ఉపయోగిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశవ్యాప్తంగా ఫిషింగ్ ప్రొటెక్షన్ ప్రారంభించిన బీఎస్ఎన్ఎల్- రూపాయికే కొత్త సిమ్