సరిహద్దుల వద్ద సైనికులు చేసే సేవ, ధైర్యం దేశానికే గర్వకారణం. ఇతర దేశాల నుంచి దేశాన్ని కాపాడుతూ.. ఉగ్రమూకల నుంచి దేశాన్ని రక్షిస్తూ.. సైనికులు పడే పాట్లు అంతా ఇంతా కాదు. ప్రస్తుతం సైనికులు మరో సాహసం చేశారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్)కు చెందిన సైనికులు ఎముకలు కొరికే చలిలో రాత్రి వేళ 180 కిలోమీటర్లు పరుగెత్తారు. 11 గంటల్లో ఈ యాత్రను పూర్తి చేశారు. 1971 యుద్ధ వీరుల గౌరవార్థం విజయ్ దివస్ సందర్భంగా జవాన్లు అనూప్ఘడ్ వద్ద అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఈ పరుగు చేపట్టారు.
సైనికులు 180 కిలోమీటర్ల పరుగు చేస్తున్న వీడియోను కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. బీఎస్ఎఫ్ జవాన్లను అభినందించారు. '1971 యుద్ధ వీరులకు బీఎస్ఎఫ్ తనదైన శైలిలో నివాళి అర్పించింది. అంతర్జాతీయ సరిహద్దు వద్ద అర్థరాత్రి జరిగిన 180 కిలోమీటర్ల బాటన్ రిలే రేస్‌లో 930 మంది బీఎస్ఎఫ్ బాయ్, గర్ల్స్ అర్ధరాత్రి పాల్గొన్నారు. 11 గంటల్లోనే పరుగు పోటీని పూర్తి చేశారు' అని రిజిజు ట్వీట్ చేశారు.
1971లో ఏడాది దాదాపు 13 రోజుల పాటు జరిగిన యుద్ధంలో పాకిస్థాన్‌ను భారత్ చిత్తుచేసింది. పాకిస్థాన్ ఆర్మీ జనరల్ ఆమిర్ అబ్దుల్లా ఖాన్.. భారత సైన్యం ముందు లొంగిపోయాడు. భారత్ సాయంతో బంగ్లాదేశ్ దేశంగా డిసెంబర్ 16న ఏర్పడింది. దీంతో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్‌లో విధులు నిర్వర్తించిన జవాన్లను గుర్తు చేసుకుంటూ భారత్, బంగ్లాదేశ్ ఆ రోజు నివాళి అర్పిస్తాయి. డిసెంబర్ 16నే బంగ్లాదేశ్ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటోంది.
1971 యుద్ధంలో భారత్ విజయం సాధించిన ఈ ఏడాది 49 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వర్ణ విజయజ్యోతిని వెలిగించి జవాన్లకు ఘన నివాళులు అర్పించారు. సైనికుల త్యాగాలను స్మరించుకున్నారు.