కరోనా వైరస్ దేశంలో అతివేగంగా విస్తరిస్తోంది. రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసుల సంఖ్య ఏడు లక్షలు దాటింది. మంగళవారం కొత్తగా 22,252 కేసులు బయటపడ్డాయి. గత 24 గంటల్లో 467మంది ఈ వ్యాధితో మరణించారు.
మన దేశంలో పది లక్షల జనాభాకు ఒకరు కోవిడ్-19తో మరణిస్తున్నారని, ఇది ప్రపంచంలో అతి తక్కువ అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇంకా సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ కరోనా మహమ్మారి బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్లు, పోలీసులపై కూడా ఈ మహమ్మారి పంజా విసురుతోంది. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో 256 మంది ఆర్మీ, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) జవాన్లు కరోనా బారినపడ్డారు.
ఇప్పటివరకు కరోనా బారినపడిన జవాన్ల సంఖ్య 1,454కు చేరింది. వీరిలో 852మంది కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. మంగళవారం ఒక్కరోజే 29మంది జవాన్లు చికిత్సకు కోలుకొని డిశ్జార్జి అయ్యారు. ప్రస్తుతం 595 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.
అలాగే లడఖ్‌లో, జమ్మూకాశ్మీర్‌ల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లోనూ కరోనా విజృంభిస్తోంది. ఈ ప్రాంతంలో మంగళవారం కొత్తగా 36 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో యాక్టివ్ కేసుల సంఖ్య 180కి చేరింది. ఇదేవిధంగా లేహ్‌లో 115 కేసులు, కార్గిల్‌లో 65 కేసులు నమోదయ్యాయి. కోవిడ్ నుంచి కోలుకున్న 24 మందిని ఆసుపత్రి నుంచి విడుదల చేశారు.