భారత్ - చైనా దేశాల మధ్య జరిగిన లెఫ్టినెంట్ స్థాయి చర్చలు సఫలమయ్యాయి. ఈ చర్చల్లో భారత మిలిటరీ అధికారుల డిమాండ్ మేరకు తమ బలగాలను వెనక్కి పిలిపించేందుకు చైనా అంగీకరించింది. ముఖ్యంగా, గాల్వాన్ లోయలోని 14, 15, 17 పాయింట్ల నుంచి తమ బలగాలను వెనక్కు తీసుకునేందుకు చైనా అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, వాస్తవాధీన రేఖ వెంబడి ఏప్రిల్ నాటి పరిస్థితి నెలకొనాలని భారత్ కోరింది. దీనికి కూడా చైనా అంగీకారం తెలిపినట్లు సమచారం.
లడఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయలో చైనా బలగాల పాశవిక దాడిలో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఈ దాడిలో భారత సైనికుల దాడిలో కూడా అనేక మంది చైనా సైనికులు కూడా చనిపోయారు. కానీ, ఈ విషయాన్ని చైనా బయటకు రానివ్వడం లేదు. కానీ, ఈ ఘర్షణల్లో కమాండర్ స్థాయి అధికారి ఒకరు చనిపోయినట్టు చైనా అంగీకరించింది.
ఈ ఘటన తర్వాత వాస్తవాధీన రేఖకు చైనా వైపున ఉన్న మోల్డోలో సోమవారం 12 గంటల పాటు లెఫ్టెనెంట్ జనరల్ స్థాయి చర్చలు జరిగాయి. భారత్ తరపున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా తరపున లిన్ లియు చర్చల్లో పాల్గొన్నారు. చర్చలు మరోమారు జరిగే అవకాశం ఉంది.
కాగా, చైనా బలగాల దాడిని ఎలాంటి ఆయుధాలు లేకుండా ఉత్త చేతులతో ఎదుర్కొన్న భారత జవాన్ల శక్తి సామర్థ్యాలు చూసి డ్రాగన్ కంట్రీలో వణుకు మొదలైందని కథనాలు వెలువడుతున్నాయి. పెద్ద సంఖ్యలో తమ జవాన్లు చనిపోవడంతో వెంటనే చర్చలకు పట్టుబట్టి మరీ సోమవారం సుధీర్ఘంగా చర్చలు జరిపినట్టు సమాచారం. మరోవైపు, భారత ఆర్మీ చీఫ్ నవరణే లడఖ్‌లో పర్యటిస్తున్న విషయం తెల్సిందే.