బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తున్న అంశం మీటూ ఉద్యమం. ఈ ఉద్యమంలో భాగంగా అనేక నటీమణులు తమకు ఎదురైన లైంగిక వేధింపులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి వెల్లడిస్తున్నారు.
ఇలా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ ఉద్యమంపై బీజేపీ ఎంపీ ఉదిత్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు సరిగ్గా ఉన్నారా... డబ్బులు చేతికందగానే మరో మగవాడి మీద పడుతున్నారంటూ వ్యాఖ్యానించారు.
మీటూ ఉద్యమంపై ఆయన మాట్లాడుతూ, 'అవును లైంగిక వేధింపులు జరిగాయనే విషయాన్ని నేను కూడా ఒప్పుకుంటాను. ఇది మగవాని స్వభావం. మరి మహిళలు సరిగ్గానే ఉన్నారా..? ఈ ఉద్యమాన్ని వారు తప్పుగా వాడుకోవడం లేదా..? దీన్ని అడ్డం పట్టుకుని వారు ఒక్కో పురుషుని దగ్గర నుంచి రూ.2 నుంచి 4 లక్షలు వసూలు చేస్తున్నారు. అలా డబ్బు చేతికి రాగానే మరో మగవాడి మీద పడుతున్నారు. ఈ ఉద్యమం పురుషుల జీవితాన్ని నాశనం చేస్తుంది' అంటూ వ్యాఖ్యానించారు.