ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెరాస అధినేత కేసీఆర్‌లకు మధ్య ఉన్న తేడా అదొక్కటేనని అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచార సభల్లో ఏపీ సీఎం చంద్రబాబుపై కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై జేసీ శనివారం స్పందించారు. ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతున్న భాషతో కేసీఆర్ తన నెత్తిన తానే చేయి పెట్టుకుంటున్నారని ఆయన జోస్యం చెప్పారు.
కేసీఆర్ భాష మార్చుకోవాలని... దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ఎలా మాట్లాడుతారో చూడాలని సూచించారు. చంద్రబాబుకు, కేసీఆర్‌కు చాలా తేడా ఉందన్నారు. 'నేను బతకాలి.. నాతో పాటు ఇంకో పదిమంది కూడా చల్లగా బతకాలన్నది చంద్రబాబు మనస్తత్వమని' అన్నారు. నేను మాత్రమే బతకాలి, ఇంకెవరూ బతకడానికి వీలులేదు అనేది ప్రధాని మోడీ ఆలోచనా విధానమన్నారు.
ఇకపోతే ప్రధాని నరేంద్ర మోడీ ఓ ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారని, ఈ విషయాన్ని తానెప్పుడో చెప్పానని వ్యాఖ్యానించారు. తాడిపత్రిలో ప్రబోధానంద ఒక క్రిమినల్ అని అతని గురించి మాట్లాడటం వేస్ట్ అని ఎంపీ జేసీ అన్నారు. ఒకరు ప్రాణాలు కోల్పోయి, 40 మంది గాయలపాలైనా ఆయనపై చర్యలు తీసుకోలేకపోయారని విమర్శించారు.