సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు భారీ ఊరట లభించింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో ఆమెను రాంపూర్‌లోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 2019 ఎన్నికల్లో జయప్రద ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా చేశారు.
అయితే, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ అనుమతి లేకుండా సూర్పుర్‌లో బహిరంగ సభ నిర్వహించి, రోడ్డును ప్రారంభించారన్న ఆరోపణలు ఆమెపై వచ్చాయి. ఆ క్రమంలో స్వార్ పోలీస్ స్టేషనులో జయప్రదపై కేసు నమోదైంది.
ఈ కేసును విచారించిన ప్రజా ప్రతినిధుల న్యాయస్థానం.. సరైన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ ఆమెను నిర్దోషిగా ప్రకటించింది. జయప్రదపై కోడ్ ఉల్లంఘన కేసును న్యాయస్థానం కొట్టేసిందని ఆమె తరపు న్యాయవాది అరుణ్ ప్రకాశ్ సక్సేనా మీడియాకు వెల్లడించారు. ప్రజా ప్రతినిధుల కోర్టు తనను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు ఇవ్వడంపై జయప్రద హర్షం వ్యక్తం చేశారు.
తనను రాంపూర్ రాకుండా అడ్డుకోవాలని కొందరు కుట్రలు పన్నుతున్నారని, కానీ ఇది తనకు రెండో ఇల్లు అని మళ్లీ మళ్లీ ఇక్కడికి వస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేస్తానని జయప్రద ప్రకటించారు.