ఇప్పటికే భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమైన అసోం, అరుణాచల ప్రదేశ్‌లకు మరో ముప్పు పొంచివుంది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో బ్రహ్మపుత్రా నది పొంగి పొర్లుతూ, ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తోంది.
మరోవైపు ఆదివారం నాడు కూడా బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతమంతా భారీ వర్షం కురిసింది. దీంతో సెంట్రల్ వాటర్ కమిషన్ రెండు రాష్ట్రాలకు ప్రమాద హెచ్చరికలను జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, ముందు జాగ్రత్త చర్యగా ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని పేర్కొంది.
కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు అసోంలో ఇప్పటికే 8 లక్షల మందిపై ప్రభావం చూపాయి. బ్రహ్మపుత్రతో పాటు దాని ఉపనదులు పొంగిప్రవహిస్తున్నాయని, అరుణాచల్‌ప్రదేశ్‌లోని దిబాంగ్, సియాంగ్ నదులు కూడా ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
బెంగాల్, సిక్కింలతో పాటు ఇతర ఈశాన్య రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. 16వ తేది వరకు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కోల్‌కత్తాలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది.