Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మిడతల ముప్పు.. ఎలా?

మిడతల ముప్పు.. ఎలా?
, సోమవారం, 1 జూన్ 2020 (12:18 IST)
ఇప్పటికే కరోనా సంక్షోభంతో అల్లాడుతున్న భారత్‌కు పశ్చిమ ప్రాంతం నుంచి వచ్చిన మిడతలగుంపు పలు రాష్ట్రాలపై దండయాత్ర ప్రారంభించాయి. దశాబ్ధాల కాలంలో జరిగిన మిడతల దాడుల్లో తాజాగా జరుగుతున్న దాడి తీవ్రమైనదిగా ఉండే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇది ఇప్పటికే దేశంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న వ్యవసాయ రంగానికి మరింత ముప్పు తెస్తుందని నిపుణులు పేర్కొన్నారు. గుజరాత్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లోని పొలాలపై ఈ మిడతల దండు దాడి ప్రారంభమైందన్న వార్తలు వస్తున్నాయి.

పురుగుల మందు పిచికారీ చేయాలని ఢిల్లీ ప్రభుత్వం మే 28న రైతులకు సూచించింది. గతేడాది గుజరాత్‌, రాజస్థాన్‌లో ఈ తరహా దాడులు జరిగాయి. వర్షాకాలం ప్రారంభమౌతున్న నేపథ్యంలో జూన్‌లో ఈ మిడతల సమూహాలను నివారించకుంటే వరి, చెరకు, పత్తి, ఇతర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవి ఆకులను తినివేయడం, గింజలను పాడుచేయడం వంటివి చేస్తాయని పేర్కొన్నారు.
 
చివరి భారీ ముట్టడి ఎప్పుడు.?
చివరిసారిగా 2010లో భారీ మిడతల దాడి జరిగింది. 1964-1997 మధ్య మొత్తం మీద 13 సార్లు ఈ మిడతల తెగుళ్లు పంటలకు సంక్రమించాయి. 1997 నుంచి 2010 మధ్య ఐదుసార్లు ఈ తరహా దాడులు జరగ్గా అవి నియంత్రించబడ్డాయి.

2010-2018 మధ్యలో పెద్దగా భారీ మిడతల దాడులు ఏమీ జరగలేదని లోకస్ట్‌ వార్నింగ్‌ ఆర్గనైజేషన్‌(ఎల్‌డబ్ల్యుఓ) పేర్కొంది. 2019లో గుజరాత్‌, రాజస్థాన్‌లో జరిగిన దాడుల్లో 3.5 లక్షల హెక్టార్లలో జీలకర్ర, ఆవాలు, ర్యాప్‌సీడ్‌లకు తీవ్ర నష్టం చేకూర్చిందని అధికారులు వెల్లడించారు.

మిడతల ముట్టడికి, వాతావరణానికి సంబంధం ఏంటి?
హిందూ మహాసముద్రం యొక్క పశ్చిమ, తూర్పు భాగాలు వేర్వేరుగా వేడెక్కడాన్ని ఇండియన్‌ ఓసియన్‌ డైపోల్‌గా పిలుస్తారు. ఇది భారత్‌, పశ్చిమ ఆసియా ప్రాంతాల్లో అధిక వర్షాలు పడేందుకు దోహం చేస్తుంది. హిందూ మహా సముద్రం డైపోల్‌ చాలా బలంగా ఉంది.

ఇది కరువు ఆందోళలను అధిగమించి గత ఏడాదిలో జూన్‌లో భారీ వర్షాలు కురిశాయి. పశ్చిమ ఆసియా, ఓమన్‌, యెమన్‌, ఇథియోపియా, సొమాలియా, కెన్యాల్లో ఈ వర్షపాతం విస్తరించిన నేపథ్యంలో పొడి ఇసుక భారీ తేమతో నిండినందున అనేక మిడతల సమూహాలను ఏర్పాటు చేసింది.

2018లో డైపోల్‌ ఒక రూపం తీసుకున్న నేపథ్యంలో గతేడాది ఆఫ్రికాలో మిడతల దాడులు ప్రారంభమయ్యాయి. అనంతరం అనుకూలంగా వీచిన గాలుల వలన అవి ఎరుగుకుంటూ ఇరాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌, పాకిస్థాన్‌, భారత్‌లకు చేరుకున్నాయి.
 
మిడతల దాడి నేపథ్యంలో ఏం చేయాలి?
పురుగు మందుల పిచికారీ, మొక్క పరిరక్షణ రసాయనాల ద్వారా మిడతల దాడిని నియంత్రించొచ్చు. గతేడాది కూడా మిడతల నివారణకు పాక్‌ సరైన చర్యలు తీసుకోలేదని భారత అధికారులు ఆరోపించారు.

పెస్టు కంట్రోల్‌ బాధ్యతలను పంచుకునేందుకు భారత్‌, పాక్‌కు చెందిన కీటక శాస్త్రవేత్తలు ప్రతి ఏడాది చర్చలు జరిపే ప్రొటోకాల్‌ అనేక సంవత్సరాలుగా ఉంది.

అయితే నిధుల కొరత, పర్యవేక్షణ లేమి కారణాలతో పాటు ఈ ఏడాది వచ్చిన కరోనా వైరస్‌ వలన ఆంఫన్‌ తుపాన్‌, మిడతల దాడి వంటి విపత్తులపై దృష్టి సారించలేకపోయారని ఐరాసకు చెందిన ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

250 రైళ్లు వృథా: మంత్రి పీయూష్‌గోయల్‌