చేపల కోసం వల విసిరితే ఏకంగా ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ చిక్కింది. ఈ సంఘటన కేరళలోని మునంబం సమీపంలోని తీర ప్రాంతంలో చోటు చేసుకుంది.
మునంబం తీర ప్రాంతంలోని సునావిూ కాలనీకి చెందిన మత్స్యకారులు ఆ ప్రదేశంలో ఎక్కువగా చేపలను వేటాడుతుంటారు. స్థానిక మత్స్యాకారుడొకరు చేపల వేటకు వెళ్లాడు. చేపల కోసం వలను అమర్చి, వెనక్కి తిరిగివచ్చాడు. వలను వెలికి తీయడానికి వెళ్లగా.. అది బరువుగా కదిలింది. దాన్ని వెలికి తీయడం అతని వల్ల కాలేదు.
తోటి మత్స్యకారులు, చేపల వేటలో వినియోగించే పరికరాల సహాయంతో వలను వెలికి తీసి చూడగా.. తుప్పు పట్టిన ఇంజిన్ కనిపించింది. సమాచారం అందుకున్న నౌకా దళ అధికారులు దీన్ని తమ నావల్ యార్డుకు తరలించారు. ఇది నాలుగు దశాబ్దాల నాటిదని వారు చెప్పారు.