Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రబాబు ఇసుక దీక్ష విచిత్రం: మంత్రి బొత్స

Advertiesment
చంద్రబాబు ఇసుక దీక్ష విచిత్రం: మంత్రి బొత్స
, గురువారం, 14 నవంబరు 2019 (08:26 IST)
స్టార్టప్ ఏరియా వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలు సింగపూర్ సంస్ధలు  సరిగ్గా చెప్పలేకపోయాయని, అందువల్లే పరస్పర అంగీకారంతో ఒప్పందం రద్దు చేసుకున్నామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

రాష్ట్రం నుంచి పెట్టుబుడులు వెళ్లిపోతున్నాయని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. రాష్ట్రం నుండి ఏం పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయో  ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ చెప్పాలని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రభుత్వం ఏం చేసినా విమర్శించడం పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.

స్టార్టప్ ఏరియా వల్ల కలిగే ప్రయోజనాలు సరిగ్గా చెప్పలేకపోయిన కారణంగానే తాము ఆ సంస్థను అంగీకరించలేదని, ఈ నేపథ్యంలో ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ స్వయంగా చెప్పారని బొత్స అన్నారు. అదేవిధంగా సింగపూర్ కంపెనీలను ప్రాజెక్ట్‌ పై పలు వివరాలు కోరినట్టు పేర్కొన్నారు. వాళ్లు చెబుతున్న ఆదాయం ఎలా వస్తుందో చూపించమన్నామని తెలిపారు.

15 రోజులు కిందటే ఈ విషయం చెప్పామని గుర్తు చేశారు. వాళ్ల దగ్గర సరైన ప్రణాళిక లేక తామే ప్రాజెక్ట్ నుంచి ఉపసంహరించుకుంటామని వెల్లడించారని తెలిపారు. రాష్ట్రంలో ఇతర రంగాల్లో పెట్టుబడి పెడతామని వారు ప్రకటించారని మంత్రి చెప్పారు. కానీ చంద్రబాబు, లోకేష్‌లు 15 రోజుల తరువాత విమర్శలు చేస్తున్నారని మంత్రి ఆగ్రహించారు.

నాలుగు రోజులు ఆగితే రాష్ట్రానికి వివిధ దేశాల నుంచి  పెట్టుబడులు ఎంత ఎక్కువగా వస్తాయో తమరే చూస్తారన్నారు. పారదర్శకమైన పాలన అందిస్తేనే పెట్టుబడులు వస్తాయని వ్యాఖ్యానించారు. అందుకే సీఎం  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పారదర్శకంగా పాలిస్తోందని చెప్పారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల కోసమే అన్నారు. తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను కొనసాగించే విధంగా సీఎం జగన్‌ పాలన ఉందని పేర్కొన్నారు. రాజధానిలో టీడీపీ నేతలు పర్యటించారన్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు.  ఈ సందర్భంగా 95 శాతం నిర్మాణాలు పూర్తి అయ్యాయని  తరుచూ మీడియా ముందుకు వచ్చి చెబుతున్నారని, అయితే ఆ బిల్డింగులు ఎక్కడ నిర్మించారో చూపించాలన్నారు.

గత ప్రభుత్వ హయాంలో తలపెట్టిన నాలుగు బిల్డింగులు కొంత శాతం మినహా మరే బిల్డింగులు పూర్తి కాలేదని స్పష్టం చేశారు. పూర్తి చేసిన బిల్డింగులు కూడా తాత్కాలికమైనవే కావడం విశేషమని మంత్రి ఎద్దేవా చేశారు.  చంద్రబాబు హయాంలోనే బీఆర్శెట్టి సంస్థ, మరో సంస్థ వెనక్కి వెళ్లిపోయాయని మంత్రి బొత్స మండిపడ్డారు. మరి చంద్రబాబు నాయుడు దానికేం సమాధానం చెప్తారని ధ్వజమెత్తారు.

చంద్రబాబు ఇసుక దోచుకుని.. ఇప్పుడు దీక్ష చేయడం విచిత్రంగా ఉందన్నారు.  గతంలో ఉచిత ఇసుక విధానం అని తెగ పబ్లిసిటీ చేసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఉచిత ఇసుక ఇచ్చారా అని మంత్రి సూటిగా ప్రశ్నించారు. తమ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, మంత్రులు, అనునాయులకు మినహా సామాన్య జనానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉచిత ఇసుక పంపిణీ చేసినట్లు ఆధారాలు చూపిస్తే తలదించుకుంటా అని బొత్స సవాల్ విసిరారు.

చంద్రబాబు బాగా పరిపాలించి ఉంటే ప్రజలు ఘోరంగా ఎందుకు ఓడించారో ఆత్మవిమర్శ చేసుకోవాలని ప్రతిపక్ష నేతకు సూచించారు. తాము చక్కగా పాలిస్తామనే నమ్మి ప్రజలు ఓట్లు వేశారని మంత్రి గుర్తుచేశారు. ప్రతిపక్ష నేత తనయుడు  లోకేష్ లోకేష్ నేరుగా మీడియాతో మాట్లాడలేక ట్విట్టర్‌లో ఏదో ఒకటి చెప్తారని మంత్రి ఎద్దేవా చేశారు.

చంద్రబాబు దోచుకోవడానికి అవకాశం లేకనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు  స్విస్ ఛాలెంజ్ విధానాన్ని నాడే చాలా మంది వ్యతిరేకించారన్న విషయం ప్రతిపక్ష పార్టీ నేతలు గుర్తిస్తే మంచిదని హితవు పలికారు.  గతంలో దోచుకునే అవకాశం ఇచ్చారు కాబట్టే సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయని తమ ప్రభుత్వంలో ఆ తరహా విధానాలు ఉండవు కాబట్టి ప్రతీది పారదర్శకంగా ఉంటుంది కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాయని మంత్రి అన్నారు. 

తప్పుడు ప్రకటనలు, తప్పడు రాతలు, ప్రజలను తప్పుదోవ పట్టించే మాటలను ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబు నాయుడుకు పబ్లిసిటే ముఖ్యమని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా ఏ సంస్థ అయినా  రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే ఆహ్వానిస్తామని, మౌలిక వసతులు పూర్తిస్థాయిలో కల్పించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న విషయాన్ని మంత్రి మరోసారి స్పష్టం చేశారు. 

సీఎం జగన్‌పై పవన్ శాపనార్ధాలు సరికాదని మంత్రి అన్నారు. పవన్ ఆక్రోశం దేనికోసమో అర్థంకావడం లేదన్నారు. రాజకీయ నాయకుడి లక్షణాలు పవన్ కళ్యాణ్‌కు లేవని విమర్శించారు.జ గన్ మట్టిలో కలిసిపోతారంటూ పవన్ కళ్యాణ్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని.. రాజకీయాల్లో  అంత ఆక్రోశం పనికిరాదని సహనం ఉండాలని మంత్రి సూచించారు.

తమ ప్రభుత్వం బాగా పరిపాలిస్తుందని చంద్రబాబుకు, పవన్ కు కడుపు మంట అని విమర్శించారు. ప్రతిపక్షం, దాని మిత్రపక్షం నిర్మాణాత్మక సూచనలు అందిస్తే పాటిస్తామని ఆ మాత్రం దానికి ఆక్రోశం దేనికని ప్రశ్నించారు. తన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి.. సామాన్యుల పిల్లలు చదవకూడదా.. అని పవన్ ను మంత్రి బొత్స ప్రశ్నించారు.

తాము ఊరుకున్న కొద్దీ పవన్ కళ్యాణ్ రోజు రోజుకి దారుణంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  తాట తీస్తా, తోలు తీస్తా లాంటి అసభ్య పదజాలం దిగజారుడుతనానికి నిదర్శనమని పరోక్షంగా విమర్శించారు. రాజకీయాల్లో విధానపరమైన ఆలోచనలు, నిర్ణయాలతో పాటు భాష ముఖ్యమని సూచించారు.

చూసే దృష్టిని బట్టి మంచా చెడా అనేది కనిపిస్తుందని ప్రతీది వ్యతిరేక భావంతో చూస్తే చెడుగానే కనిపిస్తుందని ఈ సందర్భంగా పచ్చకామెర్లు వచ్చినోళ్లకి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్న సామెతని మంత్రి గుర్తుచేశారు. కోపతాపాలు ఉంటే ఇంటి వరకే ఉండాలని సమాజంలోకి వచ్చినప్పుడు  అవి అతిగా ప్రదర్శించవద్దని హితవు పలికారు. 

ఇంగ్లీష్ భాషపై పట్టులేకపోతే విద్యార్థులకు భవిష్యత్ ఎలా అని పవన్‌ కళ్యాణ్‌ను బొత్స  ప్రశ్నించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మాతృభాష మనుగడను కాపాడుకోవాలని అదే క్రమంలో ఇంగ్లీష్ భాష నైపుణ్యాలు ఉంటే మంచిదన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు.

విద్యావిధానంలో మార్పు వల్ల, ఇంగ్లీష్ నేర్చుకోవడం ద్వారా రాబోయే కాలంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.  పవన్ మాటల్లో అహంభావం, అహంకారం కనిపిస్తుందన్నారు. మూడుసార్లు మంత్రిగా చేసినా ఇంగ్లీషుపై తనకు కూడా పట్టులేదని తద్వారా తాను మంత్రిగా ఉంటూ పలు ఇబ్బందులు పడుతున్నానని మంత్రి తెలిపారు.

విధానాల్లో మార్పు వల్ల కొంత ఇబ్బంది కలగక తప్పదని ఏది చేసినా మంచికే అన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని సూచించారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం నిజంగా తప్పుగా మాట్లాడితే ఖండించాలని, ‘స్పీకర్‌ మాట్లాడింది తప్పు... ఇది సంప్రదాయం కాదు’ అని చెప్పాలన్నారు.

అంతేగాని ద్వంద్వ అర్థాలు తీసుకురావొద్దని మంత్రి బొత్స టీడీపీ నేతలకు సూచించారు. ఇసుక మాఫియా పేరుతో టీడీపీ విడుదల చేసిన ఛార్జ్‌ షీట్‌లో ఇష్టం వచ్చినట్లు రాశారని బొత్స విమర్శించారు. తమ జిల్లాలో ఇసుక మాఫియా జరిగిందని నిరూపిస్తే దేనికైనా రెడీ అని సవాల్ విసిరారు.

చంద్రబాబు కొంగ జపాలు ప్రజలకు తెలుసని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు. ఐదేళ్లు ఇసుక మాఫియాను ప్రోత్సహించి దొంగ దీక్షలు చేస్తున్నాడని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజల ఆర్థిక సామర్థ్యం, జీవన ప్రమాణాలు పెరిగి ఉంటే టీడీపీని ఎందుకు ఓడించారో మననం చేసుకోవాలన్నారు.

ప్రజలు ఇబ్బందులు పడ్డారు కాబట్టే దారుణంగా ఓడించారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.  చంద్రబాబు అంత మంచి పాలన అందిస్తే 23 సీట్లే ఎందుకు వస్తాయని బొత్స ప్రశ్నించారు. రాజకీయ ఉనికి కోసం చంద్రబాబు రోజు ఏదొకటి చేస్తుంటాడని అన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడు కొన్ని సమస్యలు వస్తుంటాయని బొత్స విమర్శించారు. 

వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నమ్మారు కాబట్టే అధికారం కట్టబెట్టారని గుర్తుచేశారు. 25 యేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగాలనే ఉద్దేశంతో జగన్ ప్రజలకు సేవ చేస్తూ ముందుకు వెళుతున్నారని తెలిపారు. 

ఇది చూసి ఓర్వలేకనే పవన్ కళ్యాణ్, చంద్రబాబు లు తమ ప్రభుత్వంపై లేనిపోని నిందలు, అనవసర రాద్దాంతాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వాన్ని తక్కువ అంచనా వేసిన చంద్రబాబు తాను అనుకున్నవేవీ జరగకపోగా అంచనాలు తలకిందులు కావడంతో సహించలేకే కడుపు మంటతో రగిలిపోతున్నారని బొత్స అన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దృక్పథం, పట్టుదల ఉంది కాబట్టే అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని