Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబు అమరావతిని భ్రమరావతిగా మార్చారు: అంబటి రాంబాబు

చంద్రబాబు అమరావతిని భ్రమరావతిగా మార్చారు: అంబటి రాంబాబు
, బుధవారం, 6 నవంబరు 2019 (21:50 IST)
అమరావతిని భ్రమరావతిగా మార్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వంకే దక్కుతుందని వైఎస్ఆర్‌ సిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. గుంటూరుజిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్ సిపి కేంద్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

రాజధాని పరిశీలన అనే పేరుతో తెలుగుదేశంకు చెందిన నాయకులు చేసిన హడావుడి... విమర్శలు అర్ధరహితమని అన్నారు. చంద్రబాబు సిఎంగా అయిదేళ్ల తన పాలనలో అమరావతి రాజధానిని నిర్మించడంలో విఫలమయ్యారని విమర్శించారు. నేడు రాజధానిలో అమరావతి-వంద స్కామ్ లు అన్న పరిస్థితి కనిపిస్తోందని అన్నారు.

మీ నిర్వాకం వల్లే అమరావతి ప్రాంతం సర్వనాశం అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిని మరిచిపోయి అమరావతిలో పర్యటన అంటూ అచ్చెన్నాయుడు, రామానాయుడు వంటి నేతలు కొత్త డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. అమరావతి పరిధిలోనే పోటీ చేసిన లోకేష్‌, ఇక్కడే నివాసం వుంటున్న టిడిపి అధినేత చంద్రబాబులు ఈ పర్యటనలో ఎందుకు రాలేదని ప్రశ్నించారు.

వారు చేసిన తప్పులను ఇక్కడి రైతులు నిలదీస్తారనే భయంతోనే వారు దూరంగా వున్నారని విమర్శించారు. రాజధాని కోసం అంటూ 33వేల ఎకరాలను రైతుల నుంచి బలవంతంగా తీసుకుని, కేంద్రం ఇచ్చిన మూడు వేల కోట్ల రూపాయలతో పాటు మొత్తం తొమ్మిది వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశామంటూ చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు.

ఈ రకంగా ప్రజాధనంను గంగపాలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. చంద్రబాబు నిర్వాకం వల్ల కనీసం ఈ రోజు కేంద్రం ఇచ్చిన మ్యాప్ లో ఎపికి రాజధాని ఎక్కడో గుర్తించలేని దుస్థితి వచ్చిందని అన్నారు. అయిదేళ్ల పాలనలో ఎందుకు అమరావతికి రాజధానిగా నోటిఫికేషన్ ఇవ్వలేదని ప్రశ్నించారు.

దీనినే మా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రస్తావిస్తే... ఆయనపైన టిడిపి నాయకులు సిగ్గు లేకుండా ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి రాజధాని అంటూ అయిదేళ్ల పాలనలో ఊహా చిత్రాలను చూపి ప్రజలను మోసం చేశారని  అంబటి రాంబాబు విమర్శించారు. బ్రహ్మాండమైన టవర్స్, పక్కనే అసెంబ్లీ, సెక్రటేరియట్ అంటూ గ్రాఫిక్స్ ను రిలీజ్ చేశారని అన్నారు.

కృష్ణానదిపై ఇదిగో ఇదే ఐకానిక్ వంతెన అంటూ అడుగుడుగునా ప్రజలకు భ్రమలు కల్పించారని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసిన గ్రాఫిక్స్ చిత్రాలను చూసిన విదేశాల్లోని తెలుగు ప్రజలు ఆహా అమరావతి ఎంత అద్భుతంగా వుందోనని సంబరపడ్డారని అన్నారు. ఇప్పుడు తెలుగుదేశం నాయకలు రాజధానిలో చేసిన పర్యటన సందర్బంగా ఈ ఊహాచిత్రాల్లో ఒక్కటైనా చూపించగలరా అని ప్రశ్నించారు.

అమరావతిలో మీరు నిర్మించినవన్నీ తాత్కాలికమేనని అన్నారు. చదరపు అడుగుకు పన్నెండు వేల రూపాయలు వెచ్చించి మీరు నిర్మించిన అన్ని భవనాలు కొద్దిపాటి వర్షం వస్తే... జలమయం అవుతున్నాయి. దీనిలో మీరు ఎంత దోచుకున్నారు... ఎంత కాజేశారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

మీ మాటలు నమ్మి భూములు ఇచ్చిన రైతులను కూడా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ప్లాట్ లు ఇవ్వకుండా... వారి భూములను కమీషన్లు తీసుకుని బయటి వారికి పంచారని అన్నారు. రాజధాని ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్ గా మార్చేశారని విమర్శించారు. సింగపూర్‌ కంపెనీలకు స్విస్ ఛాలెంజ్ అంటూ అత్యంత విలువైన భూములను దారాదత్తం చేశారని అన్నారు.

స్విస్‌ ఛాలెంజ్‌ ను జనసేనలోని నాయకుడుగా వున్న తోట చంద్రశేఖర్ కోర్టులో సవాల్ చేశారని, దీనిపై తెలుగుదేశం నేతలు ఏమంటారని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగింది, దీనిపై అచ్చెన్నాయుడు ఎలా జరిగిందో ఎందుకు చెప్పడం లేదని అన్నారు.

రాజధాని ప్రాంతంలో మీ హాయంలో ముడుపులు తీసుకుని, అధికరేట్లకు కట్టబెట్టిన కాంట్రాక్ట్ పనులకు రివర్స్ టెండరింగ్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. ఈ పనులను చూపించి రాజధాని నిర్మాణం నిలిచిపోయిందని తెలుగుదేశం నేతలు గగ్గోలు పెడుతున్నారని తెలిపారు.

అమరావతికి శంకుస్థాపన చేసిన సమయంలోనే టిడిపి రాష్ట్ర కార్యాలయం పనులు చేపట్టారని, మీ పార్టీ కార్యాలయం పూర్తవుతోంది కానీ, అమరావతి శంకుస్థాపన పనులు ఎందుకు ముందుకు సాగలేదని ప్రశ్నించారు. 
చంద్రబాబు ఇసుక సత్యాగ్రహం చేస్తానంటూ రెచ్చిపోతున్నారని అంబటి రాంబాబు విమర్శించారు.

మహాత్ముడు ఉప్పు సత్యాగ్రహం చేశారని, తాను ఇసుక సత్యాగ్రహం చేస్తున్నానని చెప్పుకుంటున్నారని అన్నారు. ఇసుక సమస్యను చూపించి వైఎస్ఆర్ సిపి పై ఏదో ఒకరకంగా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. టిడిపి హాయంలో జరిగిన ఇసుక దందాను సరిచేయాలనే మా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. 

సినిమాల్లో హీరోగా వున్న పవన్‌ కళ్యాణ్‌... రాజకీయాల్లో విలన్ గా మిగిలిపోయారని అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు మెయిన్ విలన్ గా, లోకేష్ బుడ్డ విలన్‌ గా, పవన్‌ కళ్యాణ్ సైడ్ విలన్ గా రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకుంటున్నారని అన్నారు. వీరి ముగ్గురిని ఒకే ఫ్రేంలో ప్రజలు చూస్తున్నారని అన్నారు.

పవన్‌ కళ్యాణ్ ఎదుటి వారిని విమర్శించే సమయంలో రెచ్చిపోయి మాట్లాడుతున్నారని అన్నారు. కర్నూలులో హైకోర్ట్ కావాలని న్యాయవాదులు పవన్‌ ను కలిస్తే... పులివెందులకు దగ్గరగా వుంటుంది.. జగన్‌ గారికి అనుకూలంగా వుంటుందని వ్యంగ్యంగా మాట్లాడటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

151 సీట్లను గెలుచుకుని ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్‌ జగన్‌ గురించి మాట్లాడే అర్హత పవన్ కు లేదని అన్నారు. పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ అపజయం పాలైన పవన్‌ కు ప్రజల్లో వున్న బలం ఏమిటో అందరికీ తెలుసునని అన్నారు. వైఎస్‌ జగన్‌ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే.. దానికి తగిన విధంగా సమాధానం చెబుతామని అన్నారు.

మీ విమర్శలకు మేం బదులు చెబుతుంటే... ఎందుకు తట్టుకోలేక పోతున్నారని పవన్‌ కళ్యాణ్‌ ను ప్రశ్నించారు. రాజకీయాల్లో వున్న వారు తమ ఇళ్లలో జరిగే శుభకార్యాలకు ప్రత్యర్ధి పార్టీల నేతలను కూడా ఆహ్వానిస్తుంటారని, ఇది మంచి సంప్రదాయమని అన్నారు.

దీనిని కూడా అపార జ్ఞానం వున్న పవన్‌ కళ్యాణ్ రాజకీయంగా చూడటం దురదృష్టకరమని అన్నారు. ప్రజాసేవ కోసం సినిమాలు వదిలేసుకుని వచ్చానని అంటున్న పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారని విమర్శించారు.

మీపై విమర్శలు చేసినందును తనను ఫ్యాక్షనీస్ట్ అంటూ పవన్ కితాబు ఇవ్వడం హాస్యాస్పదంగా వుందని అన్నారు. చిరంజీవి సోదరుడిగా... తెలుగు ప్రజల ఆశీస్సులతోనే పవన్ సినిమా హీరో అయ్యారని, రాజకీయంగా మాత్రం విలన్ గా మిగిలిపోయారని విమర్శించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యడియూరప్ప నాకు రూ. 1000 కోట్లిచ్చాడంటున్న అనర్హత ఎమ్మెల్యే, సీఎం పోస్ట్ హుళక్కేనా?