ఓ మహిళను దుండగులు అపహరించి ఓ గదిలో బంధించారు. తొమ్మిది రోజులపాటు లైంగికంగా వేధించారు. ఎట్టకేలకు బాధితురాలు వారి చెర నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హరియాణాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.
సోహ్నా గ్రామానికి చెందిన వివాహిత(20) గత నెల 30న పరిచయం ఉన్న వ్యక్తితోనే మాట్లాడుతుండగా.. అతని ఇద్దరు స్నేహితులు కారులో వచ్చి ఆమెను అపహరించారు. మరో వ్యక్తితో కలిసి నలుగురు దుండగులు ఆమెను ఫరిదాబాద్‌లో ఓ గదిలో నిర్భందించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు.
తొమ్మిది రోజుల తర్వాత అంటే జులై 8న ఆమె వారి నుంచి తప్పించుకొని భల్లబ్‌గఢ్ బస్‌స్టేషన్ చేరుకుంది. అక్కడి నుంచి వారి కుటుంబానికి ఫోన్ చేసింది వెంటనే కుటుంబసభ్యులు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై తాజాగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను అహరించిన వారు తనకు తెలుసని, వారిలో ఒకరు పోలీస్ కానిస్టేబుల్ ఉన్నట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
మరోవైపు బాధితురాలికి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు సహకరించిన తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ కేసులపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.