తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ ఎమ్మెల్యేపై కేసు పెట్టింది ఓ యువతి. ఆమె పెట్టిన కేసు నుంచి ఎలాగైనా బయటపడాలని సదరు ఎమ్మెల్యే ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ అవన్నీ ఫలించలేదు. దీంతో చేసేదేమి లేక కేసు పెట్టిన మహిళనే పెళ్లాడాడు సదరు ఎమ్మెల్యే.
పూర్తి వివరాల్లోకి వెళితే... త్రిపురలో రిమా వ్యాలీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఐపీఎఫ్‌టీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ధనుంజయ్. కాగా ఈయన తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మహిళ మే నెల 20న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ధనుంజయ్ తనతో గత కొన్నిరోజులుగా సన్నిహితంగా వుంటూ వచ్చాడనీ, ఆ క్రమంలో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని వెల్లడించింది. తనపై అఘాయిత్యం చేయడంతో తనను పెళ్లాడాలని కోరగా ముఖం చాటేశాడని ఫిర్యాదులో పేర్కొంది.
దీనితో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించేందుకు సమాయత్తమయ్యారు. ఈలోగా బెయిల్ కోసం అతడు ప్రయత్నించాడు కానీ అతడి వల్లకాలేదు. దీంతో చేసేది లేక తనపై రేప్ కేసు పెట్టిన యువతినే పెళ్లాడాడు ఎమ్మెల్యే. భవిష్యత్తులో ఎలాంటి తమ కాపురంలో ఎలాంటి సమస్యలు తలెత్తవంటూ ఇరు కుటుంబాల బంధువుల వద్ద ఒప్పందం కూడా చేసుకున్నాడు.