బీహార్‌లో 'జీవితపుత్రిక' పండుగ సందర్భంగా వేర్వేరు సంఘటనలలో నదులు, చెరువులలో పవిత్ర స్నానాలు చేస్తూ 37 మంది పిల్లలతో సహా కనీసం 43 మంది నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు.
ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గురువారం ధ్రువీకరించింది. బుధవారం జరిగిన పండుగ సందర్భంగా రాష్ట్రంలోని 15 జిల్లాల్లో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. 'జీవితపుత్రిక' పండుగ సందర్భంగా, మహిళలు తమ పిల్లల క్షేమం కోసం ఉపవాసం ఉంటారు. పిల్లలతో కలిసి మహిళలు పవిత్ర స్నానాలు చేస్తారు.
ఈ క్రమంలో చెరువులు, సరస్సుల్లో స్నానానికి దిగిన 43 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మొత్తం 43 మృతదేహాలను వెలికితీశారు. మృతుల బంధువులకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియాను ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటించారు.