Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మణిపూర్‌లో మళ్లీ హింస.. నలుగురు ప్రాణాలు కోల్పోయారు..

manipur roits
, మంగళవారం, 2 జనవరి 2024 (08:33 IST)
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. దీంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. తౌబాల్ జిల్లాలో స్థానికులపై ఓ దుండగుల సామూహం కాల్పులకు తెగబడింది. అయితే, స్థానికులు మాత్రం దోపిడీకి వచ్చారని చెబుతున్నారు. ఈ దుండగులు జరిపిన కాల్పుల్లో ఏకంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత దుండగులు వాహనాలకు నిప్పు పెట్టడంతో హింస చెలరేగింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. ఐదు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. అదేసమయంలో ఈ ఘటనపై మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తన మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారులతో అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 
 
మణిపూర్‌లో కొత్త సంవత్సరం తొలి రోజున ఒక దుండగుల సమూహం జరిపిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తౌబాల్ జిల్లాలోని లిలాంగ్‌లో ఈ ఘటన జరిగింది. దాడికి పాల్పడిన దుండగుల వాహనాలకు స్థానికులు నిప్పు పెట్టడంతో అక్కడ హింస చెలరేగింది. దీంతో రాష్ట్రంలోని ఐదు లోయ జిల్లాల్లో తిరిగి కర్ఫ్యూను విధించాల్సి వచ్చింది. తౌబాల్, ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, కక్చింగ్, బిష్ణుపూర్ జిల్లాల్లో కర్ఫ్యూను విధించినట్లు అధికారులు తెలిపారు. 
 
కొందరు వ్యక్తులు ఆటోమేటిక్ ఆయుధాలతో కాల్పలు జరిపారని, దోపిడీ కోసం వచ్చి ఈ దారుణానికి తెగబడ్డారని స్థానికులు చెబుతున్నారు. దుండగుల సమూహం ఓ స్థానిక వ్యక్తితో మాట్లాడుతుండగా వారి మధ్య గొడవ జరిగిందని, కొద్దిసేపటికి అందరిపై కాల్పులు జరిపారని ఓ వ్యక్తి వెల్లడించారు. ఈ హింసాత్మక ఘటనపై మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ స్పందించారు. 
 
హింసాత్మక ఘటనను ఆయన ఖండించారు. శాంతిని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అమాయక ప్రజల ప్రాణాలు తీయడం పట్ల విచారం వ్యక్తం చేశారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయన్నారు. నేరస్థులను గుర్తించేందుకు ప్రభుత్వానికి సహాయం చేయాలంటూ లిలాంగ్ ప్రజలను ఆయన కోరారు.
 
గత యేడాది మే 3వ తేదీన మణిపూర్‌లో చెలరేగిన హింస 2023లో జరిగిన ముఖ్య ఘటనల్లో ఒకటిగా నిలిచిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో చోటుచేసుకున్న తీవ్ర హింసలో 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా సుమారు 60,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ పరిస్థితుల్లో తిరిగి ఈ హింసాత్మక ఘటనపై మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం బీరెన్ సింగ్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తున్న జేఎన్ 1 కేసులు