మందు బాబులకు మరోసారి కరోనా కష్టాలు తప్పేలా లేవు. కరోనా విజృంభిస్తోన్న వేళ.. మందు షాపులు మూతపడిన రోజులున్నాయి. మళ్లీ ఆ రోజులు తిరిగి వచ్చే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో.. హోలీ పండుగ రోజున మద్యం షాపులు మూసేయడంతో.. ఓ ముగ్గురు వ్యక్తులు శానిటైజర్‌లో నీళ్లు కలుపుకొని తాగారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదకర ఘటన మద్యప్రదేశ్ లోని బింద్ జిల్లాలో చోటు చేసుకుంది.
హోలీ పండుగ రోజున రింకూ లోధి అనే వ్యక్తి.. మద్యం సేవించాలనుకున్నాడు. కానీ హోలీ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం మద్యం దుకాణాలను మూసివేయించింది. దీంతో లోధి రెండు శానిటైజర్ బాటిళ్లను తీసుకొని తన బంధువులైన సంజు, అమిత్ వద్దకు వెళ్లాడు. ముగ్గురు కలిసి శానిటైజర్‌లో వాటర్ కలుపుకొని సేవించారు. అదే రోజు రాత్రి లోధి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
అతన్ని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. అమిత్ గ్వాలియర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, సంజు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.